
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. ప్రతీఒక్కరు విఽధిగా పనిచేస్తున్న చోటే ఉండాలని ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో వాగులు, వంకలు పొంగే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తూ ఉండాలని, మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకొని, అంతరాయం కలిగిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నారు. మొబైల్ యాప్‌లో వినాయక మండపాల వివరాలు నమోదు చేయాలని వివరించారు. ఎన్ని కిలోవాట్ల లోడ్ వినియోగిస్తున్నారో నమోదు చేయాలని, తద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎంత భారం పడుతుందో తెలుసుకునే అవకాశముంటుందన్నారు. గత ఏడాది దాదాపు 35,000 విగ్రహాలు నమోదయ్యాయని, ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. విద్యుత్ భద్రతపై ఉత్సవ నిర్వాహకులకు తెలియజేయాలని, సంబంధిత లైన్‌మెన్లు, లైన్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఈల నంబర్లు కూడా ఇవ్వాలని సూచించారు. ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాల నిమజ్జన రూట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, రోడ్ క్రాసింగ్స్ ఉన్న చోట్ల 11 మీటర్ల స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలను కూడా విధిగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 నంబర్‌కు ఫోన్ చేయాలని నవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు సీఎండీ సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, సీఈలు సదర్‌లాల్, అశోక్, వెంకటరమణ, జీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు.
వినాయక మండపాలను యాప్‌లో
అప్‌లోడ్ చేయాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
ఎస్‌ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్