
అప్రమత్తతే రక్ష
● వినాయక మండపాల ఏర్పాటులో
నిబంధనలు తప్పనిసరి
● జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల నివారణ
నెహ్రూసెంటర్: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. కమిటీల ఆధ్వర్యంలో మండపాలు ఏర్పాటు చేయడంతో పాటు వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టిస్తున్నారు. కాగా, ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గణపయ్య విగ్రహాలను మండపాలకు తరలించేటప్పుడు, తిరిగి నిమజ్జన సమయంలో విద్యుత్‌వైర్లకు తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసేలా, గణపతి నిమజ్జనం సమయంలో రూట్లను పరిశీలించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టేలా ఇప్పటికే విద్యుత్ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేశారు.
మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● గణపతి మండపాలు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర, విద్యుత్ లైన్లు, వైర్ల కింద ఏర్పాటు చేయవద్దు
● అర్హత కలిగిన టెక్నీషియన్‌లతోనే లైటింగ్, వైరింగ్ చేయించుకోవాలి
● వైర్లు నాణ్యమైనవి ఉపయోగించాలి. ఎలాంటి జాయింట్స్ లేకుండా చూసుకోవాలి
● స్తంభాల నుంచి విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బందితోనే తీసుకోవాలి
● ఇనుప స్తంభాలకు సపోర్టు లేకుండా వైర్లు తీసుకోవాలి
● సర్వీస్ వైర్లు, ఇతర విద్యుత్ వైర్లు నేలపై నుంచి తీసుకురావొద్దు
● త్రీ పిన్ ఫ్లగ్‌లనే ఉపయోగించాలి. ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి
● ఐరన్ వస్తువుల ద్వారా మండపాల ఏర్పాటు జరిగితే షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
● మండపాలనికి ఒకటి మాత్రమే సర్వీస్ వైరు తీసుకోవాలి. మరొకటి తగిలించకూడదు
● ఇన్వర్టర్, జనరేటర్ ఉపయోగిస్తే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి
● గణపతి మండపాల్లో వినియోగించే ప్రతీ కరెంట్ సామగ్రికి ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి
● తడి చేతులతో స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లను తాకొద్దు
● స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలు పిల్లలకు అందకుండా ఎత్తులో ఉంచాలి
● వినాయక నిమజ్జన రూట్లలో వైర్లు తగలకుండా విద్యుత్ అధికారులు తనిఖీలు చేసి క్లియరెన్స్ చేయాలి
● ఉత్సవ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి
● విద్యుత్ అత్యవసర వేళల్లో విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి
● వైర్లు తెగిపడిన వెంటనే అధికారులకు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలి