
ప్రజాప్రతినిధులకు అవగాహన శూన్యం
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
డోర్నకల్: జిల్లాలో యూరియా అవసరాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. డోర్నకల్‌లో ఆదివారం సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ.. నాట్లు వేసే సమయంలో యూరియా కొరత రావడం ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. యుద్ధాల వల్ల యూరియా కొరత ఏర్పడిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. పాలకులు విహారయాత్రల్లో తేలుతున్నారని, ప్రభుత్వ విప్ వీడియో సందేశాలు పంపుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డోర్నకల్‌లో నల్లబెల్లం, గంజాయి, బియ్యం, గుట్కా, ఇసుక, మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు డబ్బు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుని, డబ్బు సంపాదన కోసం లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, గుడుంబాతో అనేక కుటుంబాలు బలయ్యాయని తెలిపారు. మార్వాడీ గోబ్యాక్ నినాదం మూర్ఖత్వమని, కొంతమంది వారి స్వార్థం కోసం ఇలాంటి నినాదాలతో ప్రజల్లో అశాంతిని రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మార్వాడీలు దశాబ్దాలుగా మనలో ఒకరిగా కలిసి ఉన్నారని, మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మన్యుపాట్ని, యశోధర్‌జైన్, గౌస్, కందుల మధు, రాంభద్రం, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.