
పొలం గట్లే పిల్లలకు దారి..
మంచ్యతండా ప్రాథమిక పాఠశాల భవనం
పొలం గట్లపై నడుస్తున్న పాఠశాల విద్యార్థులు
మరిపెడ రూరల్: మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోని పలు పాఠశాలలు పొలాల మధ్య ఉండడంతో సరైన రహదారులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయ తీ పరిధిలోని మంచ్యతండాలో 20 ఏళ్ల క్రితం పొలాల మధ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అందులోనే అంగన్‌వాడీ కేంద్రంతోపాటు పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో 10 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, గదిలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. వరండాలో అంగన్‌వాడీ పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు. కాగా దారి లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు పొలం గట్ల మీదుగా పాఠశాలకు వెళ్లి, అదే గట్లపై మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి, గట్ల వెంబడి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలం గట్లు తడిసిపోయి పిల్లలు జారి కింద పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు తక్షణమే అదనపు గదులతో పాటు, రహదారిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచ్యతండా వాసులు కోరుతున్నారు.
రహదారి లేని మంచ్యతండా పాఠశాల
ఇరుకు గదిలోనే 30 మంది విద్యార్థులకు బోధన
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

పొలం గట్లే పిల్లలకు దారి..