
మైనర్లపై అఘాయిత్యం నేరం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్: లైంగిక అఘాయిత్యం మైనర్ బాలుడిపై జరిగినా పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లాలో పోక్సో కేసుల నమోదు, విచారణ తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారుల సమావేశం న్యాయ సేవ సదన్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. సాధారణంగా మైనర్ బాలికలపై లైంగిక అఘాయిత్యం జరిగితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని అపోహ సమాజంలో ఉందని, కానీ 18 సంవత్సరాలలోపు వయసున్న బాలబాలికలపై జరిగిన లైంగిక నేరాలన్నీ పోక్సో చట్టపరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఏ చట్టం చేసినా బాలలు మంచి వాతావరణంలో పెరగాలన్నదే ఆ చట్టాల ఉద్దేశమని తెలిపారు. బాలలపై లైంగిక నేరం జరిగినట్లు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయయనివారుకూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులేనని వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ.. పోక్సో చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా వివిధ రకాల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు డేనియల్, అశోక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి నరేష్, తదితరులు పాల్గొన్నారు.