
యూరియా వినియోగం తగ్గించాలి
● ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు
మహబూబాబాద్ రూరల్: యూరియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులను ఉద్దేశించి శ్రీనివాసరావు శనివారం మాట్లాడారు. యూరియాను అధిక మొత్తంలో వినియోగించి అనారోగ్యాల పాలుకావద్దన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 21,071.452. మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన తెలిపారు. ఇఫ్కో కంపెనీ నుంచి ప్రభుత్వం 112 మెట్రిక టన్నుల యూరియా కేటాయించారని, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. ఆదివారం ఆర్.సీ.ఎఫ్ కంపెనీ నుంచి 112 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయింపు చేస్తారని తెలిపారు. 500 ఎం.ఎల్ నానో యూరియా 50 కిలోల యూరియా బస్తాకు సమానమని వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ నాయిని రంజిత్, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ప్రమోద్ పాల్గొన్నారు.