
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలోని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు టౌన్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన అల్లం రవీందర్ గతంలో మధ్యప్రదేశ్ నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయించేవాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆశీష్ ఠాకూర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా రవీందర్ మాదిరి దొంగ మద్యం విక్రయించేవాడు. ఈ క్రమంలో ఖమ్మంకు చెందిన ఆర్‌ఎంపీ షేక్.సాబీర్ పాషా..రవీందర్‌కు పరిచయం కాగా ఇద్దరు కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలకున్నారు. దీంతో ఆశీష్ ఠాకూర్‌ను కలిసి రూ.2.50 లక్షలు అందజేసి నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్ తెప్పించారు. వారందరికి వరంగల్ పెరికవాడకు చెందిన ములుగు రాజు, రాంతేజ, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురానికి చెందిన ఓర్పు గోపాలకృష్ణ, జక్కుల రమేశ్ పరిచయమయ్యారు. ఆరుగురు కలిసి ఆశీష్ ఠాకూర్ పంపిన స్పిరిట్‌తో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో నకిలీ మద్యం తయారు చేశారు. దానిని ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో విక్రయించాలన్నారు. ఈ క్రమంలో గురువారం గోపాలకృష్ణ, రమేశ్, సాబీర్ పాషా రెండు కార్లలో వచ్చి మద్యం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గోపాలకృష్ణ, సాబీర్ పాషా, రమేశ్, రవీందర్, రాజును అరెస్ట్ చేయగా రాంతేజ, ఆశీష్ ఠాకూర్ పరారీలో ఉన్నారని ఎస్పీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు.
రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం,
60 లీటర్ల స్పిరిట్, 2 కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్