
విషజ్వరంతో చిన్నారి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు కుమార్తె సాత్విక (22 నెలల వయసు) సంతానం. ఒక్కగానొక్క కూతురు కావడంతో సాత్వికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. స్థానికంగా ఆర్‌ఎంపీలకు చూపించినా తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విషజ్వరంగా గుర్తించి రక్తకణాలు తక్కువ ఉన్నాయని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. రెండేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ కూతురు మృతదేహం మీదపడి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి స్వాత్విక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పలువురికి విష జ్వరాలు వస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● కొత్తపల్లిలో విషాదఛాయలు