
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పత్తి:
● సాధ్యమైనంతవరకు వర్షపు నీటిని తొలగించాలి.
● ఎరువుల యాజమాన్యంలో 15 నుంచి 20 కిలోల యారియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పోటాష్‌ను వర్షం తగ్గాక వేసుకోవాలి.
● భూమిలో తేమ అధికంగా ఉంటే వేర్లు పోషకాలను తీసుకునే అవకాశం లేకపోవడంతో పైపోటుగా 20 గ్రాముల పోటాషియం నైట్రేట్‌ను పిచికారీ చేసుకోవాలి.
● తేమ వల్ల వేరుకుళ్లు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి లేదా కార్బెండైజమ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి మొక్క మొదళ్లలో పోయాలి.
వరి:
● వరికి సంబంధించి ప్రస్తుతం నాట్లు కొనసాగుతున్నందున వర్షపు నీరు నిలవకుండా కాలువల ద్వారా తొలగించాలి.
● నారు దశలో ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత నారుమడి కొరకు 19:19:19 పోషకాన్ని 10 గ్రాములు, కార్బైండైజమ్, మార్కోజెమ్‌లను 2.5 గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● నాటు వేసేవారు ప్రతీ 2.3 మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు సోకి చీడపీడల ఉధృత్తి తగ్గుతుండటంతోపాటు ఎరువులు చల్లడానికి, సస్యరక్షణ చర్యలకు ఉపయోగపడుతుంది.
మిరప:
● మిరప నారుమడి దశలో ఉన్నందున వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయాలి. నీటి నిల్వలు ఉంటే నారుకుళ్లు, ఎండుతెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటర్ నీటితో కలిపి మొక్క మొదలు తడిసేలా వేయాలి.
మొక్కజొన్న:
● వర్షాలతో పంటలో చేరిన నీటిని తొలగించాలి.
● నేల ఆరిన తర్వాత 19:19:19 లేదా 13:0:45 ఎరువును పైపాటుగా పిచికారీ చేయాలి.
● నేల ఆరిన తర్వాత అంతర్‌కృషి చేసుకుని అడుగు భాగంలో ఎరువులు వేసుకోవాలి.
● ఇతర ఆరుతడి పంటల్లో వరదనీటిని తొలగించి అంతరకృషి చేసి పైపాటుతోపాటు అడుగు భాగంలో రసాయన ఎరువులను వేసుకోవాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నందున పంటలలో కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ తీగలు, మోటార్లు, స్టార్టర్ల ఏర్పాటులో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ తీగలను నేరుగా తాకవద్దు. వర్షంపడే సమయంలో చెట్ల క్రింద నిలబడకుండా ఇంటికి వెళ్లిపోవాలి.
వరుస వానలతో వ్యవసాయ
భూముల్లో నిలుస్తున్న నీరు
ఆందోళనలో అన్నదాతలు
జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు

పంటలను కాపాడుకోండిలా...