
విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి
హన్మకొండ : విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించాలని ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినా పెడచెవిన పెడుతున్నారని, అన్ని సర్కిళ్ల ఎస్‌ఈలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా కేబుల్ వైర్లు రీ–అలైన్‌మెంట్ చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. స్పందించకపోతే వాటిని తొలగించాలని ఎస్‌ఈలు, డీఈలకు సూచించారు. ప్రజల భద్రత ముఖ్యమని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలని సూచించారు. అధికారులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ లైన్లను క్రమబద్దీకరించాలన్నారు. అధిక ఎత్తులో ఉన్న వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ లైన్లకు తాకకుండా లైన్లను డీస్‌కనెక్ట్ చేయాలని సూచించారు. వినాయక నిమజ్జన రూట్లను తనిఖీ చేయాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ పండుగలను విజయవంతం చేయాలన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి