
ఎన్‌డీలో మరో సంక్షోభం..
బయ్యారం: ఒకప్పుడు ఇల్లందు నియోజకవర్గాన్ని పెట్టనికోటగా మార్చుకున్న న్యూడెమోక్రసీ(ఎన్‌డీ)లో మరో సంక్షోభం తలెత్తింది. ఫలితంగా కాలక్రమేణా వస్తున్న చీలికలతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. తాజాగా న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) రాష్ట్ర కార్యదర్శి అశోక్.. కొందరు నాయకులతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ విషయం సంచలనంగా మారింది. అయితే చంద్రన్న వర్గానికి రాజీనామా చేసినా తాము న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని అశోక్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మరో విప్లవగ్రూపు ఆవిర్భవించినట్లు భావించొచ్చు. బయ్యారంలోని వీబీటీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఖమ్మం–వరంగల్ ఏరియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న పెద్దచంద్రన్న వ్యక్తిగత నిర్ణయాలు, విప్లవేతర పనులు పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారాయన్నారు. ఈ క్రమంలో పార్టీ కమిటీల సమావేశాలకు తగిన సమయం ఇవ్వలేని స్థితి ఏర్పడడంతో చంద్రన్నవర్గానికి రాజీనామా చేశామన్నారు. ప్రస్తుతం ప్రజాసమస్యల పరిష్కారంపై విప్లవ సంస్థలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉండడంతో తాము భవిష్యత్‌లో విప్లవ సంస్థల ఐక్యతకు అనుకూలంగా ఉంటామన్నారు. చంద్రన్నవర్గానికి రాజీనామా ప్రకటించిన వారిలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఊక్లా, శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా నాయకులు మదార్, కోటమ్మ, పాపారావు, వెంకటేశ్వర్లు, హనుమంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, చిన్నలింగయ్య, షర్పొద్దీన్, వెంకన్న, నర్సిరెడ్డి, కవిత, బాలయ్య, రాంసింగ్, దేవేందర్ తదితరులున్నారు.
ప్రజాపంథా నుంచి చీలికలు.. చీలికలుగా..
ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రజాపంథా విప్లవగ్రూపు బలమైన పునాది ఏర్పర్చుకుంది. ఆ పార్టీ తరఫున గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుపెట్టారు. ఆ తర్వాత ప్రజాపంథా పార్టీ పేరును న్యూడెమోక్రసీగా మార్చారు. కాలక్రమేణా ఆ పార్టీలో వచ్చిన సిద్ధాంత విభేదాలతో న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయింది. అనంతరం రాయలవర్గంలో ఏర్పడిన చీలికలో ఒక వర్గం మాస్‌లైన్(ప్రజాపంథా) పార్టీని ఏర్పాటు చేయగా మరోవర్గం న్యూడెమోక్రసీ( యతీంధ్రకుమార్‌వర్గం)గా కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రన్నవర్గంలో ఏర్పడిన చీలికలో బయటకు వచ్చిన నాయకులు యతీంధ్రకుమార్ వర్గంలో చేరగా తాజాగా అశోక్ నాయకత్వంలో ఏర్పడిన చీలికవర్గం తాము న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని ప్రకటించడంతో ఇప్పటికే రాష్ట్రంలో రెండు న్యూడెమోక్రసీలు ఉండగా కొత్తగా మరోటి ఏర్పడనుంది. రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పడే న్యూడెమోక్రసీ మరోవర్గంలో విలీనమవుతుందా లేక పార్టీగా కొనసాగుతుందా అనే అంశం భవిష్యత్‌లో తేలనుంది.
ఇప్పటికే వర్గాలుగా చీలిపోయిన
విప్లవ పార్టీలో మరో చీలిక
చంద్రన్న వర్గానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శి అశోక్
న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని ప్రకటన