
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ములుగు నుంచి ఆమె వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, సంబంఽధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రాణ, అస్తి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, వాగులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా తాత్కాలిక మరమ్మతులు చేసిన చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన పరిస్థితులు లేవన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్‌అనిల్‌కుమార్, ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల ప్రత్యేక అదికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రి ధనసరి సీతక్క