
ఆర్టీసీకి ఆదాయం
నెహ్రూసెంటర్: వరలక్ష్మీ వ్రతం, రాఖీ, బోనాల పండుగతో ఐదురోజుల పాటు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మహబూబాబాద్ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి 11వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సు లను నడిపించారు. సాధారణ ప్రయాణికులతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అధికంగా బస్సుల్లో ప్రయాణాలు సాగించారు. దీంతో 85.56 ఈపీకే, 139 ఓఆర్‌తో మహబూబాబాద్ డిపో ముందంజలో ఉంది. 5రోజులపాటు 47ప్రత్యేక బస్సులు, 167 ట్రిప్పులు, 1,8565 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా రూ.19,70,030 ఆదాయం సమకూరింది. అదే విధంగా తొర్రూరు డిపో నుంచి 93 రెగ్యులర్ బస్సులతో పాటు 10 ప్రత్యేక బస్సులను ఐదు రోజులు నడిపించగా రూ.1,77,15,571 ఆదాయం వచ్చింది.
చాలెంజ్‌ల్లో ముందంజ..
మహబూబాబాద్ ఆర్టీసీ డిపో పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు, విహార యాత్రలు వంటి ఆర్టీసీ చాలెంజ్ కార్యక్రమాల్లో ముందు వరుసల్లో ఉండడంతో పాటు అత్యధిక ఆదాయం తీసుకువచ్చిన డిపోల్లో నిలుస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా బిజీగా మారిన ఆర్టీసీ బస్సులు.. పండుగలు, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా మారుతున్నాయి. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా బస్సులను నడపడం ద్వారా మానుకోట ఆర్టీసీకి ఆదరణ పెరుగుతోంది.
మహాలక్ష్మి పథకంలోనూ..
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదురోజుల పాటు ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలు అధికంగా ప్రయాణాలు సాగించారు. మానుకోట డిపో నుంచి ఐదు రోజుల్లో 18,565 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగా అందులో అత్యధిక శాతం అనగా 13,031మంది మహిళా ఉచిత ప్రయాణికులే ఉన్నారు. ఇతర ప్రయాణికులు 5,534మంది ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
రద్దీకి అనుగుణంగా..
బోనాలు, రాఖీ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 47 ప్రత్యేక సర్వీసులు, రెగ్యులర్ బస్సులను నడిపించాం. ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేశాం. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలి. ఆర్టీసీ చాలెంజ్‌లో ముందుండేలా ఉద్యోగులు, సిబ్బంది కృషి చేస్తున్నారు.
–ఎం.శివప్రసాద్,
ఆర్టీసీ డీఎం, మానుకోట
తొర్రూరు డిపోకు వచ్చిన ఆదాయం
తేదీ కిలోమీటర్లు ఆదాయం
7 40590 రూ.2,378,289
8 42536 రూ.3,216,026
9 47725 రూ.4,758,067
10 41684 రూ.3,081,017
11 46841 రూ.4,282,172
ఐదు రోజుల్లో మానుకోట డిపోకు వచ్చిన ఆదాయం
తేదీ బస్సులు ట్రిప్పులు కిలోమీటర్లు ఆదాయం
7 2 6 744 రూ.58,450
8 13 38 6104 రూ.5,52,780
9 12 44 5818 రూ.5,04,310
10 7 32 3516 రూ.2,94,570
11 13 47 6842 రూ.5,59,920
రాఖీ, బోనాల పండుగకు ప్రత్యేక బస్సులు
మానుకోట డిపోకు ఐదు రోజుల్లో
రూ.19 లక్షల ఆదాయం
తొర్రూరు డిపోకు రూ.1.77కోట్ల ఆదాయం

ఆర్టీసీకి ఆదాయం