ఎట్టకేలకు పనులు షురూ..
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో సుందరీకరణ పనులపై అధికారులు దృష్టి సారించారు. జంక్షన్ల సుందరీకరణ కోసం నిధులు కేటాయించినప్పటికీ.. ట్రాఫిక్ ఇతర సమస్యలతో పనుల్లో కొంత జాప్యం జరిగింది. ఎట్టకేలకు రెండు జంక్షన్ల సుందరీకరణ పనులకు లైన్‌క్లియర్ కాగా.. మంగళవారం మూడుకొట్ల జంక్షన్‌లో అభివృద్ధి పనులు మొదలుపెట్టారు.
మూడు జంక్షన్లు..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని మూడు ప్రధాన జంక్షన్ల సుందరీకరణకు ఇటీవల ఎమ్మెల్యే మురళీనాయక్ శంకుస్థాపన చేశారు. మూడుకొట్ల సెంటర్‌లో సరిపడా స్థలం ఉండడంతో సమస్య రాలేదు. అయితే ముత్యాలమ్మ సెంటర్‌లో స్థల సమస్య ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు. కురవి రోడ్డులో జంక్షన్ అభివృద్ధికి మార్కింగ్ చేశారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
పట్టణ ప్రగతి నుంచి..
పట్టణ ప్రగతి, స్టాంపు డ్యూటీ నిధుల నుంచి జంక్షన్ల అభివృద్ధికి రూ.1.5కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి మూడు జంక్షన్ల సందరీకరణ పనులకు రూ.75 లక్షలు కేటాయించారు. అలాగే వివేకాంద జంక్షన్‌లో మరమ్మతులకు రూ.15 లక్షలు, వైఎస్సార్ జంక్షన్‌లో మరమ్మతులకు రూ.15లక్షలు కేటాయించారు.
స్థల సమస్య..
జిల్లా కేంద్రంలో కొత్తగా చేపట్టే మూడు జంక్షన్ల సుందరీకరణ పనుల విషయంలో స్థలంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అయితే ఎమ్మెల్యే మురళీనాయక్ పనులకు శంకుస్థాపన చేయగా.. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే ముత్యాలమ్మ గుడి వద్ద మార్కింగ్ చేసిన స్థలంలో జంక్షన్ అభివృద్ధి చేయవద్దని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని బీజీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది కొంత మార్పు చేశా రు. కాగా ప్రస్తుతం మూడుకొట్ల సెంటర్‌లో మాత్ర మే జంక్షన్ సుందరీకరణ పనులు ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలో మూడు జంక్షన్ల సుందరీకరణకు రూ.75 లక్షలు
పట్టణ ప్రగతి, స్టాంపు డ్యూటీ
నిధుల నుంచి కేటాయింపు


