నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు చనిపో..
వర్ధన్నపేట : ప్రస్తుత సమాజంలో రక్తసంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్తి కోసం కన్న తండ్రి అని చూడకుండా కుమారుడు, కోడలు నిత్యం వేధింపులకు గురిచేసి అతడు బలవన్మరణానికి పాల్పడేలా కారణమయ్యారు. పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తుండగా దీనికి ఆ వృద్ధుడు ససేమిరా అంటున్నాడు. దీంతో మానసికంగా హింసిస్తున్నారు. నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు మందు తాగి చనిపో అని కోడలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు గడ్డిమందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కడారిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లేశం(93)కు నలుగురు సంతానం. చిన్న కుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్ర.. గత కొద్ది రోజులుగా ఆస్తి కోసం నిత్యం వేధిస్తున్నారు. మల్లేశం పేర ఉన్న పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎలేంద్ర ‘నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు.. మందు తాగి చనిపో’ అని మామ మల్లేశంను వేధించింది. దీంతో మల్లేశం ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన రెండో కుమారుడు చంద్రమౌళి వెంటనే 108లో ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం రాత్రి 8.20 గంటలకు మల్లేశం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కూతురు అమరావతి విజయ ఫిర్యాదు మేరకు చిన్నకుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ సోమవారం తెలిపారు.
ఆస్తి కోసం తండ్రికి కొడుకు, కోడలు మానసిక వేధింపులు
● మనస్తాపంతో గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
● కడారిగూడెం గ్రామంలో ఘటన
● పోలీసులకు మృతుడి కూతురు ఫిర్యాదు.. కేసు నమోదు


