మావోయిస్టు ప్రస్థానం
వివిధ ఎన్‌కౌంటర్లలో నేలరాలిన నలుగురు నక్సల్స్ వెంకటరమణ, సంతోశ్‌రెడ్డి, శ్రీను, రేణుక
ముగిసిన
‘కడవెండి’
అరుణతారలో మెరిసిన ‘మిడ్కో’
దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ ప్రభావం.. కాలానుగుణంగా ఉద్బవించిన నక్సల్స్ ఉద్యమ ప్రభావం.. వెరసి నివురుగప్పిన నిప్పులా ఉండే మావోయిస్టు కీలక మహిళా నేత గుమ్ముడవెల్లి రేణుక 25ఏళ్ల కిందట మావోయుస్టు అనుబంధ అరుణతార పుస్తకంలో తన రచనలతో మిడ్కోగా మెరిసింది. గోండి భాషలో ‘మిడ్కో’ అంటే ‘మిణుగురు పూవు’. అంతటి అందమైన పేరుతో ఆమె రాసిన విప్లవ కథల్లో ప్రత్యేక శైలి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలన అనేక ప్రాంతాల్లో మహిళా ఉద్యమ నిర్మాణంలో పనిచేసింది. విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్తూ ఆచరణాత్మకంగా మహిళా ధృక్పథం నుంచి అద్భుతమైన కథలు రాసింది. ఆమె రాసిన ‘మెట్లమీద’ కథ తెలుగు కథా సాహిత్యంలో చర్చనీయాంశమైంది. ఆమె కథల్ని విరసం 2007లో ‘మెట్లమీద’ పేరుతో పుస్తకం ప్రచురించింది. ఇంతటి సాహితీవేత్త ‘మిడ్కో’ ఇవాళ దండకారణ్యంలో పోలీసుల కాల్పుల్లో చనిపోవడం.. సాహితీవ్యవస్థ అంధకారంగా మారిందని సామాజిక వేత్తలు, మేథావులు, కవులు, రచయితలు అభిప్రాయపడ్డారు.
● సీపీఐ(ఎంఎల్) నక్సల్స్ విస్తరణకు పునాదులు ఇక్కడే..
● మూగబోయిన విప్లవోద్యమాల
పురిటి కెరటం
● ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో
అసువులుబాసిన గుమ్ముడవెల్లి రేణుక
● కడవెండిలోనే రేణుకకు
తుది వీడ్కోలుకు సన్నాహాలు
● ఆమె పుట్టిపెరిగిన ఇంటిని
పరిశీలించిన పోలీసులు
దేవరుప్పుల : భూమి కోసం.. భుక్తి కోసం.. బానిసబంధాల విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ కడవెండి. ఇక్కడి నుంచే తుపాకీతోనే సమసమాజ స్థాపన అంటూ అడవిబాట పట్టిన అగ్రనేతల ప్రస్థానం తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులుబాసిన రేణుకతో ముగిసినట్లయ్యింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం వామపక్షభావాజాల పార్టీల సిద్ధాంతాలను విభేదించి సీపీఐ(ఎంఎల్) ఏర్పడిన నేపథ్యంలో అనతికాలంలో జనశక్తి, పీపుల్స్‌వార్ గ్రూపులుగా వీడిన క్రమంలో కడవెండి ఇరువురి పోరాటాల్లో కీలక భూమిక పోషించింది. ఈ తరుణంలో కడవెండి పడమటితోట నివాసిత భూ పంపిణీ పోరాట నేపథ్యంలో పీపుల్స్‌వార్ గ్రూపు విస్తరణ పైచేయిగా మారింది. ఈ పోరాటాన్ని వేదికగా చేసుకుని అన్నదమ్ములు ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి, సంతోశ్‌రెడ్డి ఉన్నతంగా చదివి ఉన్నత ఉద్యోగాలు వచ్చే క్రమంలో సమసమాజ స్థాపన ధ్యేయంగా పీపుల్స్‌వార్ గ్రూప్‌నకు అంకితమయ్యారు. వీరి నాయకత్వాన ఈ ప్రాంతం నక్సల్స్‌కు పెట్టని కోటగా మారే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పైండ్ల వెంకటరమణ 1986లో నర్సంపేట పీపుల్స్‌వార్ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ నాచినపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీఐ అశోక్‌ను హతం చేసి తాను అసువులు బాశాడు. జీవీకే ప్రసా ద్ అలియాస్ ఉసెండి , ఈయన సోదరి గుమ్ముడవెల్లి రేణుక సైతం పార్టీలో చేరారు. 1999లో కరీంనగర్ కొయ్యూరు ఎన్‌కౌంటర్ పేరిట అప్పటి ఉమ్మడి రాష్ట్ర పీపుల్స్‌వార్ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి అలియాస్ మహేశ్, ఆ తర్వాత ఇదే గ్రామానికి చెందిన పెద్ది శ్రీను నెక్కొండ ఏరియా దళసభ్యుడి హోదాలో ఎన్‌కౌంటర్ అయ్యారు. సంతోశ్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌కు ముందే అతడి అన్న పురుషోత్తంరెడ్డి దండకారణ్య స్పెషల్ జోన్‌ల్ కమిటీ స్థాయిలో పనిచేసే క్రమంలో అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పదేళ్ల క్రితం జీవీకే ప్రసాద్ అనా రోగ్యంతో లొంగిపోయాడు. ఇలాంటి అగ్రనేతలను స్ఫూర్తిగా తీసుకుని అడవి బాట పట్టిన రేణుక తాజా ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
మూగబోయిన కడవెండి..
ఇక్కడే రేణుక అంత్యక్రియలకు సన్నాహాలు
రజాకార్ల నుంచి అడవి బిడ్డల సమస్యల సాధన కోసం ఉద్భవించిన పోరాటాల్లో కీలక భూమిక పోషించిన నేతలు నేలరాలడంతో నేడు కడవెండి మూగపోయింది. చివరి నక్సల్స్ నేతగా ప్రజాక్షేత్రంలో తిరిగిన రేణుకకు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడ ఇల్లు లేకున్నా పుట్టిపెరిగిన పెద్దనాన్న(పాత ఇంట్లో) గృహం వద్ద నుంచే అంత్యక్రియలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేణుక మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు దంతెవాడకు బయలుదేరారు. ఉద్యమాలకు నిలయమైన కడవెండి వేదికగా రేణుకకు వీడ్కోలు పలికేందుకు తీవ్ర విషాదంలో గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
2004 తరువాత కుటుంబంతో సంబంధాలు లేవు
మా సోదరి తిరుపతి, ఆ తరువాత వైజాగ్ ఉండేది. 2004 తరువాత మా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్‌కౌంటర్ వార్త తెలిసేంత వరకు మాకు ఆమెతో సంబంధాలు లేవు. పదేళ్ల క్రితం వరకు ఉత్తరాలు రాసేది. ఆ తర్వాత అవి కూడా బంద్ అయిపోయాయి. ఎన్‌కౌంటర్ వార్త కూడా సోషల్‌మీడియా ద్వారా మధ్యాహ్నం తెలిసింది. మేము బయలుదేరి దంతెవాడ వెళ్తున్నాం. మంగళవారం కానీ, బుధవారం కానీ కడవెండిలో అంత్యక్రియలు నిర్వహిస్తాం.
– రాజశేఖర్, రేణుక సోదరుడు
రేణుకను విగత జీవిగా
చూడాల్సి వస్తుందనుకోలేదు
పద్మశాలి వంశపారంపర్య చేనేత వృత్తి చేసుకునే మా కుటుంబంలో మా తమ్ముడు సోమయ్య ఉపాధ్యాయుడయ్యాడని సంతోషం పడేవారం. మా తమ్ముడు కొడుకు జీవీకే ప్రసాద్ చురుకై న వాడు. కానీ రేణుక నివురుగప్పిన మాదిరి నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లింది. ఈ రోజు విగత జీవిగా వస్తున్న మా కూతురును వృద్ధులమైన మేము చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు ఆపాలి.
–గుమ్ముడవెల్లి లక్ష్మీనర్సు,చంద్రమ్మ,
కడవెండి (రేణుక పెద్దనాన్న, పెద్దమ్మ)
●
ప్రజాపోరాటాలపై
పాలకులు యుద్ధం ఆపాలి
దేశంలో జరుగుతున్న ప్రజాపోరాటాలపై పాలకవర్గాల యుద్ధం ఆపాలి. ఆదివాసీ ప్రజల బాగు కోసం ప్రామాణిక రచనలు చేస్తూ ప్రజాసమస్యల సాధన కోసం పాటుపడిన న్యాయవాది, మావోయిస్టు నేత రేణుక నేలరాలడంపై ప్రభుత్వాలు వాస్తవిక దృక్పథంతో అధ్యయనం చేయాలి. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలి.
–అస్నాల శ్రీనివాస్,
దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ప్రతినిధి, కడవెండి
రేణుక మావోయిస్టు పార్టీలోకి పోయిందంటే విస్మయం చెందాం
మేము ఏడో తరగతి చదువుకున్న రోజుల్లో ఆ తర్వాత అ ప్పుడప్పుడూ కలిసిన క్రమంలో నిమ్మదస్తురాలిగా ఉండే రేణుక మావోయిస్టు పార్టీలోకి పోయిందంటే విస్మయం చెందాం. యాభై ఐదు ఏళ్లలో ఎక్కడో మహిళ నేతగా ప్రజల కోసం చనిపోవడం ఓ వైపు ఆనందంగా ఉంది. మరో వైపు అక్కడి ప్రభుత్వం మహిళ అని చూడకుండా ఎన్‌కౌంటర్ చేయడం బాధాకరం.
–పంతం సుజాత, రేణుక క్లాస్‌మేట్ కడవెండి
రేణుక అంత్యక్రియలపై పోలీసుల ఆరా..
దండకారణ్య స్పెషల్‌జోన్‌ల్ కమిటీ సభ్యురాలు రేణుక మృతదేహాన్ని స్వగ్రామం కడవెండికి తీసుకువస్తారన్న సమాచారం మేరకు స్థానిక ఎస్సై సృజన్‌కుమార్ ఆమె పెద్దనాన్న ఇంటికి చేరుకొని వివరాలు ఆరా తీశారు.
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం
మావోయిస్టు ప్రస్థానం


