పోలీసులకు సవాల్‌గా ‘కత్తిపోటు’ కేసు.. అనుమానాలెన్నో.. | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్‌గా ‘కత్తిపోటు’ కేసు.. అనుమానాలెన్నో..

Aug 12 2023 1:22 AM | Updated on Aug 12 2023 10:13 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ నగరంలోని మిల్స్‌కాలనీ ఠాణా పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన కత్తిపోటు కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ సమయంలో వరంగల్‌ నగరం నడిబొడ్డున ఈనెల 5వ తేదీ రాత్రి గణేశ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వారం రోజులు కావొస్తున్నా.. పోలీసులు ఏం తేల్చలేకపోతున్నారు.

ఎం.శ్రీనివాస్‌, అతడి బావమర్ది కె.రంజిత్‌కు బ్యాంకులో ఇప్పించిన దాదాపు రూ.కోటిన్నర రుణం కింద ఇవ్వాల్సిన కమీషన్‌ అడిగినందుకే తనపై దాడి చేశారని చారుగండ్ల శ్రీనివాస్‌ మిల్స్‌కాలనీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రక్తపు మరకలతో ఎంజీఎం ఆస్పత్రికి వెళ్తే వైద్యులు చికిత్స అందించారు. దాదాపు కడుపుపై మూడు కుట్లు వేసి మరుసటి రోజు డిశ్చార్జ్‌ చేశారు.

అనుమానాలెన్నో.. పోలీసులు తేల్చాల్సిందే..
● నిందితుడు ఎం.శ్రీనివాస్‌ అదే రోజు రాత్రి వరకు హైదరాబాద్‌లో ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడి సీసీటీవీ ఫుటేజీలను తెప్పిస్తున్నట్టుగా తెలిసింది.
● బాధితుడు సి.శ్రీనివాస్‌ మాత్రం తనపై దాడి చేసింది ఎం.శ్రీనివాస్‌, కె.రంజిత్‌ అని ఖరాఖండిగా పోలీసులకు చెబుతున్నాడు. దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలో నిందితుడు ఎం.శ్రీనివాస్‌ ఇంటి వద్ద సీసీ టీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాధితుడు శ్రీనివాస్‌ అతడి ఇంటి ముందుకు వచ్చి బండిపైనే ఉండి పిలిచినట్టుగా ఉన్న దశ్యాలు రికార్డు అయ్యాయి.
● బాధితుడు ఆరోపిస్తున్నట్టుగా తనపై దాడి చేసిన సమయంలో అటువైపుగా కారు వెళ్లడం వల్ల బండి స్లో చేశానని, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేస్తుండడంతో బండి పట్టుకొని ముందుకొచ్చానని చెప్పాడు.
●బాధితుడు చెప్పినట్లుగా ఆ సమయంలో అటువైపుగా వెళ్లిన కారు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీకి చిక్కాలి. అటువంటిదేమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇతడిపై దాడి జరిగి పరారైన వెంటనే ఆ కారు వెనక్కి తీసుకొని వెళ్లారా? వెళ్తే మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యం చిక్కి ఉంటుంది కదా.. ఆ దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
● బాధితుడే కత్తితో దాడి చేసుకొని ఇలా చేశాడన్న ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం ఎంత అన్నది పోలీసులు తేల్చాలి. బాధితుడు మాత్రం తనను తాను పొడుచుకునేంత ఖర్మ పట్టలేదని, కమీషన్‌ ఇవ్వాలని కొన్నిరోజులుగా వారి చుట్టూ తిరుగుతున్నానని, దాని కోసం ప్రాణం తీసుకునే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. అవసరమైతే తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానే తప్ప ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు.
● దీంతో అసలు ఏం జరిగిందనే దిశగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు నిందితులెవరో తేల్చాల్సిన అవసరం కనిపిస్తోంది. అవసరమైతే ఆ దాడి చేసిన సమయంలో ఫిర్యాదుదారుడు శ్రీనివాస్‌తో పాటు ఇంకా ఎవరి మొబైల్‌ నంబర్‌లు ఆ ప్రాంతంలో పనిచేశాయి అనే దిశగా కూడా విచారించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement