భవిష్యత్ తరాల కోసమే..
మేడారంలో రాతి కట్టడాలు
ములుగు/తాడ్వాయి: ఆదివాసీల ఆరాధ్యదైవాలు సమక్క, సారలమ్మ వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలపడానికి మేడారంలో 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కలిసి వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దెల చుట్టూ నిర్మించిన రాతి కట్టడాలు, ఆలయ ప్రహరీ, ప్రధాన ఆర్చ్‌లు, సాండ్ స్టోన్ శిల్పాలు, డ్రెయినేజీ వ్యవస్థ, మీడియా టవర్, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఆలయ ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మేడారం హరిత హోటల్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల మేడారం మహాజాతరను అద్భుతంగా నిర్వహించామని, జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. సుమారు కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జంపన్న వాగులో సంవత్సరమంతా నీరు ఉండేలా గోదావరి జలాలను తీసుకురావా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం ఐదు చెక్ డ్యామ్‌లు నిర్మించి నీటి నిల్వను పెంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో మేడారం జా తర పూర్తయిన తర్వాత సమీక్షలు జరగలేదన్నారు. కానీ ఈసారి జాతర అనంతరం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వాహనంలో జంపన్న వాగు, ఊరట్టం, చిలకలగుట్ట, ఆర్టీసీ జంక్షన్ పరిసరాలను పరిశీలించారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి , పక్కన మంత్రి సీతక్క
అమ్మవార్లను దర్శించుకుంటున్న మంత్రులు పొంగులేటి, సీతక్క
జంపన్న వాగులో నిరంతరం
గోదావరి నీరు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన
భవిష్యత్ తరాల కోసమే..


