నిషేధిత భూముల జాబితా.. భారీ కుంభకోణం
జనగామ : ‘నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు చేర్చి ప్రభుత్వం డబ్బుల వసూళ్లకు పాల్పడుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచి మండల స్థాయి వరకూ ప్రజలను నలిపేస్తున్నారు’ అని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నిషేధిత భూములను తొలగిస్తామని చెప్పి, ఇప్పుడు కోటి ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో ఉంచిందని ఆరోపించారు. నిషేధిత భూముల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అందులో భారీ స్కాం దాగి ఉందని, ధైర్యం ఉంటే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో మొదటి విడుతలో ఆరు లక్షల 18 వేల మంది రైతులకు సాదాబైనామాలు చేసిన ఘనత ఉందని, రెండో దశలో ఎనిమిది లక్షల 92 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కోర్టు తీర్పు మేరకు ఇవ్వలేకపోయామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, ఇప్పటి వరకూ ఒక్క రైతుకూ రెగ్యులర్ చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లే కాదు, ఆలయాలకు కూడా ప్రమాదం వచ్చిందని, కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతో శారదా పీఠాన్ని కూల్చివేయడానికి పోలీసులు వెళ్లారని, ఇది ఎలాంటి పాలననో ప్రజలు చూస్తున్నారన్నారు. రైతుబంధు విషయంలో రేవంత్‌రెడ్డి మాటలు, పనులు వేరుగా ఉన్నాయని మండిపడ్డారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ నీళ్లు అడ్డగోలుగా తీసుకుపోతున్నా రేవంత్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారని ఫైరయ్యారు. భవిష్యత్‌లో హెదరాబాద్‌కు కూడా తాగునీరు కరువయ్యే పరిస్థితి వస్తుందని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
● ఇళ్లతోపాటు ఆలయాలను కూల్చి వేస్తున్నారు
● బీఆర్‌ఎస్ డిప్యూటీ
ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు


