ఆస్పరి: ఓటమి భయంతోనే టీడీపీ కుట్రలకు పా ల్ప డుతోందని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకొని సేవ చేసే వారికే సర్పంచ్, వార్డు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, జెడ్పీటీసీ బసవరాజు ఓటర్లును కోరారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ మద్దతుతో మేజర్ గ్రామ పంచాయతీ ఆస్పరి సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన దబ్బల అశోక్ తరపున ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. కూటమి పార్టీల తరపున పోటీ చేసిన సర్పంచులకు ఓటు వేయకపోతే పింఛన్లు తొలగిస్తామని భయపెడుతున్నారని, అలాంటి బెదరింపులకు భయపడవద్దన్నారు. అలాంటి పరిస్థితే వస్తే తాము అండగా ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఆస్పరి మండలంలో నాలుగు ఎంపీటీసీలను బలవంతంగా లాక్కున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆస్పరికి వస్తున్న సందర్భంగా గత జూలై 24న ఆస్పరి మండలంలో సాగు, తాగునీటి సౌకర్యం కల్పించాలని తాను ఆస్పరిలో విలేకరుల సమావేశంలో కోరడంతోనే కక్షపూరితంగా తనపై అక్రమ కేసులు బనాయించి 70 రోజులు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడబోమని, ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి తమ పార్టీ మద్దతు అశోక్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఎమ్మెల్యే ప్రచారానికి జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.


