కార్తీకమాసం రెండవ సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి
పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించిన వేలాది మంది భక్తులు
కనుల పండుగగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రం కార్తీక వెలుగులతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఓం నమః శివాయ.., హర..హర..మహాదేవా, శంభో శంకరా.. అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్తీకమాసం రెండో సోమవారం శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. వేకువజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనులపండువగా సాగింది. రద్దీ దృష్ట్యా భక్తులందరికి దర్శనం కల్పించేందుకు శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర(శివ)మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. లక్షదీపోత్సవ కార్యక్రమంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా లక్ష దీపాలను ఏర్పాటు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. అలాగే సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను శాస్త్రోక్తంగా ఇచ్చారు. పూజా కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


