కర్నూలు(సెంట్రల్): గోనెగండ్ల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జహంగీర్‌కు పడిన బ్యాలెట్ పేపర్లను కరెంట్ తీసి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వేశారన్నారు. అందులో కొన్ని లభ్యం కాగా, మరికొన్నింటిని కాల్చివేశారని, అందుకు సంబంధించిన ఆధారాలను కలెక్టర్ డాక్టర్ సిరికి సమర్పించినట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకుల అక్రమాలకు లెక్కే లేదన్నారు. నామినేషన్ వేయడం నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుస్తుండడంతో టీడీపీ నాయకులకు దిక్కుతోచలేదన్నారు. అధికారాన్ని వినియోగించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పడిన ఓట్ల కట్టలను బయటకు వేశారని, ఇందుకు గోనెగండ్ల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఎమ్మిగనూరు జూనియర్ కశాశాలలో బయట పడిన బ్యాలెట్ పేపర్లే నిదర్శనమన్నారు. కర్నూలు మునిసిపల్ ఎన్నికల్లో 23వ వార్డు, 50వ వార్డుల్లో చెల్లని ఓట్లను టీడీపీ అభ్యర్థులకు కలిపి తమ పార్టీ అభ్యర్థులు ఓడినట్లు ప్రకటించారన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. గోనెగండ్ల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి బయటకు వచ్చిన బ్యాలెట్ పేపర్లపై కలెక్టర్ విచారణ జరిపి అక్రమాలను వెలుగులోకి తేవాలన్నారు. లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైకోర్టుకు వెళ్తామన్నారు. గోనెగండ్ల జెడ్పీటీసీ స్థానానికి రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి జహంగీర్, లీగల్ సెల్ నాయకులు గురురాజరావు, నాయకులు బండే నవాజ్ తదితరులు పాల్గొన్నారు.


