బాధితుల ఇళ్లపై దాడికి యత్నం..
తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం వైద్యశాలకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను అంతటి వదలకుండా వారి కుటుంబ సభ్యులను కూడా భయబ్రాంతులకు గురిచేయాలని వారి ఇళ్ల మీదకు కూడా వెళ్లారు. దాడి చేసేందుకు యత్నించడంతో అనేక కాలనీల్లో మహిళ లు, చిన్నారులు భయపడి ఇళ్ల తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో దాక్కోవాల్సి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం మూ డు గంటలకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ప్రచారం చేసుకునేందుకు అనుమతి తీసుకుని అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందే టీడీపీ శ్రేణులు మారుణాయుధాలతో అక్కడ తిష్ట వేసి ఒక్కసారిగా దాడులకు తెగబడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆళ్లగడ్డ: ప్రశాంతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను ఓటమి భయంతో అధికార పార్టీ రణరంగంగా మార్చింది. బెదిరింపులకు నెరవక ధైర్యంగా నామినేషన్ వేసి బరిలో నిలిచిన ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా పచ్చమూకలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నాయి. మండల కేంద్రం చాగలమర్రిలో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ మద్దతులో బరిలో నిల్చిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకోవాలని శనివారం రాత్రి వరకు అధికార పార్టీ విశ్వప్రయత్నం చేసింది. అధికారులు, పోలీసులతో రాజీకి యత్నించింది. అయినా ‘పోటీ నుంచి తప్పుకునేది లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు పోతాం ..ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం. లేకుంటే ఓడిపోతాం’ అని ఖరాకండిగా చెప్పడంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులు ఎలాగైనా భయబ్రాంతులకు గురి చేయాలని భావించి దాడులకు తెరతీశారు.
కర్రలు, రాడ్లతో వెంబడించి దాడులు..
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ప్రచారం నిర్వహించకుండా భయభ్రాంతులకు గురిచేయాలనే ముందస్తు పథకం ప్రకారమే పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి సుమారు 30, 40 మంది కిరాయి రౌడీమూకలను తెచ్చి పెట్టుకున్నారు. ఇదేమీ తెలియని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం అధికారులతో అనుమతి తీసుకుని మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి వెంట ఉన్న ఇళ్ల వద్ద ప్రచారం చేస్తుండగా అధికార పార్టీకి చెందిన కిరాయి రౌడీలు కర్రలు, రాడ్లు, రాళ్లు పట్టుకుని ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే దొరికినోళ్లను దొరికినట్లు విచక్షణా రహితంగా కొడుతూ బీభత్సం సృష్టించారు. దాడుల్లో దాదాపు 10 మందికి పైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు తలలు పగిలి రక్తపు మడుగులో పడిపోగా చూస్తున్న ప్రజలు ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. గాయపడిన క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా అంతటితో ఆగని పచ్చ రౌడీలు రాత్రి పొద్దుపోయే వరకు రాడ్లు, కర్రలు పట్టుకుని వీధుల్లో బైక్‌లు, కార్లలో తిరుగుతూ కనిపించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తిడుతూ భయభ్రాంతులకు గురి చేశారు.
నామినేషన్ ఉపసహరించుకోలేదని
టీడీపీ శ్రేణుల స్వైర విహారం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కర్రలు,
రాడ్లు, రాళ్లతో దాడులు
ఏడుగురికి తీవ్ర గాయాలు
ప్రధాన నాయకుల ఇళ్లపై
దాడికి యత్నం
పచ్చనేతలకు వత్తాసు పలుకుతున్న
పోలీసులు
చాగలమర్రిలో ఉద్రిక్తత


