మంత్రాలయంలో టీ‘ఢీ’పీ | - | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో టీ‘ఢీ’పీ

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

తెలుగుదేశం పార్టీలో ముసుగేసుకున్న ప్రచ్ఛన్న యుద్ధం పంచాయతీ ఎన్నికలతో రచ్చ కెక్కింది. తాడో పేడో తేల్చుకునేందుకు అధిష్టానం కాదన్నా.. తిక్కారెడ్డి వర్గం కాలు దువ్వుతోంది. తెగువ చూపుకునేందుకు సమరానికి సై అంటోంది. సొంత పార్టీలోనే తిరుగుబాటు ఎగసిపడటంతో ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రరెడ్డి డైలామాలో పడాల్సి వచ్చింది. పంచాయతీలో గట్టెక్కేందుకు తల బాదుకోవాల్సిన దుస్థితి దాపురించింది. వర్గపోరు సమసకపోవడంతో పల్లెపోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా పరిషత్‌ ఎన్నికల్లో కంగుతిన్న పొత్తు పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కనుమరుగయ్యా యి. రగులుకున్న ప్రచ్ఛన్నయుద్ధంపై కథనం. – మంత్రాలయం

2014 నుంచి టీడీపీలో కొనసాగుతూ పాలకుర్తి తిక్కారెడ్డి ఆ పార్టీకి బాసటగా నిలిచారు. బలమైన నాయకుడు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డికి ఎదురొడ్డి పార్టీ క్యాడెర్‌ను కాపాడుకుంటూ వచ్చాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగి ఓటమి పాలయ్యాడు. అయినా పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటూ ఉనికిని చాటుతూ వచ్చాడు. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్య రీతిలో మాధవరం రాఘవేంద్రరెడ్డిని ఎమ్మెల్యే అభర్థి టిక్కెట్‌ వరించింది. ఎన్నికల్లో ఓటమి పాలైన రాఘవేంద్రరెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఆయన ఎంట్రీతో తిక్కారెడ్డి తిరోగమనం మొదలైంది. ఇన్నేళ్లు పార్టీని కాపాడుకున్నా కూరలో కరివేపాకులా ఆయన్ని పార్టీ వాడేసుకుంది. కంటితుడుపుగా రెండేళ్లు పార్టీ జిలా అధ్యక్ష పదవి ఇచ్చి పోరు మాన్పించారు. మంత్రాలయంలో ఆయన ప్రభావాన్ని తగ్గిస్తూ వచ్చారు. తన వర్గాన్ని దూరం చేసి తన ఉనికినే ప్రశ్నార్థకం చేశారు. రాఘవేంద్రరెడ్డి సైతం అవకాశం కొద్దీ తిక్కారెడ్డి వర్గాన్ని పలుచన గావించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తిక్కారెడ్డి ఎటూ తేల్చుకోలేని డిఫెన్స్‌లో పడ్డారు.

రాఘవేంద్రరెడ్డి ఎదురీత

తిక్కారెడ్డి వర్గం తిరగబడటంతో రాఘవేంద్రరెడ్డి ఎదురీత తప్పలేదు. 12 చోట్ల తన వర్గీయులను గెలిపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు. తిక్కారెడ్డి వర్గీయుల ప్రవేశంతో టీడీపీ ఓటు బ్యాంకు చీలి తమ ఉనికి దెబ్బతింటుందని భావిస్తున్నాడు. బరిలో నుంచి తప్పించుకునేందుకు పార్టీ అధిష్టానం నుంచి మంతనాలు జరిపినా లాభం లేకపోయింది. పార్టీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాసరెడ్డి దూతగా వచ్చి ఇరువురిని ఎదురెదురుగా కూర్చోబెట్టినా చర్చలు ఫలించలేదు. తమ మద్దతుదారులు ఓటమి పాలైతే తన భవిష్యత్తుపై ప్రభావం పడుతోందన్న ఆందోళనలో రాఘవేంద్రరెడ్డి ఉండిపోయారు. సొంత పార్టీలోనే వేరు కుంపట్ల నేపథ్యంలో టీడీపీ మద్దతుదారుల భవితవ్యం నల్లేరుపై నడకగా మారింది.

పత్తాలేని కూటమి పార్టీలు

పరిషత్‌ ఎన్నికల్లో జనసేన మంత్రాలయం–3లో పోటీ చేసి గెలిచింది. కోసిగిలో ఓ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకుంది. 76 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం రెండు స్థానాల్లో చెరో ఒకటితో సరిపెట్టుకున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీల ఊసే లేకపోవడం విశేషం. 94 పంచాయతీల్లో ఒక్క చోట కూడా తమ మద్దతుదారులను బరిలో నిలపకపోవడం విడ్డూరం.

ఉనికి కోసం ఉబలాటం

టీడీపీలో తిక్కారెడ్డి శకం ముగింపు దశకు చేరినట్టేనేమో! పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయనకు ప్రాధాన్యత కొరవడిందని తెలుస్తోంది. అధిష్టానం గుర్తింపు దక్కక పోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో తమ వర్గం పోటీకి సిద్ధ పడింది. జన బలం నిరూపణతో పార్టీలో తన ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు మేజర్‌ పంచాయతీలతోపాటు 09 పంచాయతీల్లో అనుచరులను బరిలోకి దింపాడు. పార్టీ మద్దతు ఇవ్వకపోయినా తన బలంతోనే పార్టీకి ఎదురొడ్డి పోరుకు సై అన్నాడు. మంత్రాలయంలో మాజీ సర్పంచు పన్నగ వెంకటేష్‌ కోడలు ఉషా, కోసిగిలో కొండగేని వీరారెడ్డి, కౌతాళంలో ఉరకుంద ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షుడు చెన్నబసప్పగౌడ్‌ భార్య శ్రేయను రంగంలోని దించారు. అలాగే కౌతాళంలోని ఉరుకుంద, ఎరిగేరి, కోసిగిలోని దొడ్డి బెళగల్‌, నేల కోసిగి, చిన్నభూంపల్లి, కామన్‌దొడ్డి, అర్లబండ, మంత్రాలయంలోని వగరూరు, మాధవరం గ్రామాల్లో తన అనుచరులను బరిలో నిలిపారు.

పాలకుర్తి తిక్కారెడ్డి వర్సెస్‌

రాఘవేంద్రరెడ్డి

తాడో పేడో తేల్చుకునేందుకు వేదికగా

సర్పంచు ఎన్నికలు

రాఘవేంద్రరెడ్డి వర్గంలోనే తిరుగుబాటు బావుటా

12 చోట్ల తిక్కారెడ్డి అనుచరుల

నామినేషన్లు

బుజ్జగింపులకు తలొగ్గని

తిక్కారెడ్డి టీమ్‌

పోరులో పత్తాలేని జనసేన, బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement