మధ్యంతర భృతి కోసం పోరాటం | - | Sakshi
Sakshi News home page

మధ్యంతర భృతి కోసం పోరాటం

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

కర్నూలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి వచ్చేలా పోరాటం చేస్తున్నామని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కరుణానిధిమూర్తి తెలిపారు. కర్నూలులో ఆదివారం నిర్వహించిన పీఆర్‌టీయూ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. పీఆర్‌సీ ఆలస్యం అయితే ముందుగా ఐఆర్‌ ఇవ్వాలన్నారు. స్కూల్‌ గ్రాంట్‌ వినియోగంలో ఉన్న నిబంధనలను సరళతరం చేయాలన్నారు.ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా ఎన్వీ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏం ధనుంజయలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దు

ఆదోని సెంట్రల్‌: ప్రైవేట్‌ ఆపరేటర్ల ద్వారా విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీని ప్రైవేణీకరణ చేయొద్దని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య సూచించారు. ఆదోనిలో ఆదివారం సీసీఎస్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆర్టీసీయే విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మూసివేసిన విద్యాధరాపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలకు తిరిగి ప్రారంభించాలన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నాలుగు వేల కొత్త బస్సులు కొనుగోలు చేసి 15 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర నాయకులు మద్దిలేటి, మజీద్‌, జోనల్‌ కమిటీ సభ్యులు పీపీ రాముడు, జిల్లా నాయకులు ఆర్‌.బి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తల్లీబిడ్డలను కాపాడిన పోలీసులు

శ్రీశైలం: కుటుంబ తగాదాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన ఒక మహిళ తన పిల్లలతో శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు. ఆమె బంధువులు ఈ విషయాన్ని తెలుసుకుని శ్రీశైలం వన్‌టౌన్‌ సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, ఎస్‌ఐ సుబ్బారెడ్డికి సమాచారం అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి కురువ సత్రం వద్దకు వెళ్లి ఉంటారని పోలీసులు తెలుసుకున్నారు. ఫొటోను ఆధారం చేసుకుని తల్లీబిడ్డలను ఆదివారం రాత్రి పది గంటల సమయంలో గుర్తించారు. ఈలోగా శ్రీశైలం చేరుకున్న కుటుంబ సభ్యులకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తల్లీబిడ్డలను సురక్షితంగా వారికి అప్పగించారు.

శ్రీగిరిలో కార్తీక రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రద్దీ నెలకొంది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని రెండవ ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. ముందుగా దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధన వేదికలైన ఉత్తరమాఢవీధిలో, ఆలయం ముందు గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి, ప్రత్యేక నోములు నోచుకున్నారు. అనంతరం ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా, భక్తులందరికీ సౌకర్యవంతమైన స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పించారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు పంపిణి చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్తీకమాస రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశవిధ హారతుల కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement