రాష్ట్రస్థాయి అండర్‌–17 క్రికెట్‌ పోటీలకు రిత్విక్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అండర్‌–17 క్రికెట్‌ పోటీలకు రిత్విక్‌

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

దేవనకొండ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రిత్విక్‌ కళ్యాణ్‌ అండర్‌–17 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాలశర్మ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు గన్నవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీల్లో రిత్విక్‌ కళ్యాణ్‌ పాల్గొంటాడని చెప్పారు. విద్యార్థి రిత్విక్‌ కళ్యాణ్‌కు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

వేరుశనగ గరిష్ట ధర రూ.9,800

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.9,800ల ధర పలికింది. మార్కెట్‌కు 477 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. కనిష్ట ధర రూ.3,101లు, మధ్యస్థ ధర రూ.9,610ల ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.అలాగే 99 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రావడంతో క్వింటా కనిష్ట ధర రూ.7,310లు, మధ్యస్థ క్వింటం ధర రూ.7,664, గరిష్ట ధర రూ.7,722లకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

● మరో యువకుడికి తీవ్ర గాయాలు

ఆదోని రూరల్‌: ఆదోని మండలం కడితోట గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెండాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దతుంబలం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం–2లోని పాండవగల్‌కు చెందిన మహేష్‌(26), నాగరాజు ఇద్దరు స్నేహితులు కలిసి ఆదోని నుంచి స్వగ్రామానికి మోటారు బైకుపై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మహేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజును చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో పాండవగల్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

సి.బెళగల్‌: మండలంలోని మారందొడ్డి గ్రామానికి చెందిన యువకుడు బండారి సుధాకర్‌ (27) అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు .. ఎస్సీ కాలనీకి చెందిన ఈ యువకుడు గూడూరు నుంచి పుల్లకూర్తి గ్రామానికి వెళ్లే దారిలోని కంకర్‌ క్రషర్‌ మిషన్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పని కోసం శనివారం సాయంకాలం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆదివారం గూడూరు పట్టణ శివారులోని కంకర మిషన్‌ దగ్గర స్కూటర్‌ కింద యువకుడి మృతదేహం కనిపించింది. మారందొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని సి.బెళగల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుడి తండ్రి గిడ్డయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కోడుమూరు ప్రభుత్వ ఆసుత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య అమృత ఐదు నెలల గర్భిణి కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

బేతంచెర్ల: పట్టణంలోని బోయపేట కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకలి రామకృష్ణ(49) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఆదివారం మృతి చెందాడు. వివరాల మేరకు.. పట్టణంలోని బోయపేట కాలనీకి చెందిన ఎరుకలి రామకృష్ణ కాలనీ సమీపం నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నా డు. ఈ క్రమంలో ఇంటికి నీరు కొడుతూ మోటర్‌ను ఆఫ్‌ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక శేషారెడ్డి సీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సుంకమ్మతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. మృతుని భార్య సుంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ విక్టర్‌ బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement