● జెడ్పీటీసీలకు గుర్తింపు కార్డులు, ఫారం–29 అందించిన సీఈఓ సుధాకర్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీలకు ఆయన గుర్తింపు కార్డులు, ఫారం–29 అందించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కంటే ముందు ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నుకునేందుకు ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఉదయం 10 గంటల్లోపు నామినేషన్లను స్వీకరించి, మధ్యాహ్నం 12 గంటల్లోపు నామినేషన్ల పరిశీలనను పూర్తి చేస్తామన్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గెలిచిన జెడ్పీటీసీలందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే జెడ్పీటీసీ సభ్యులు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాలో గెలుపొందిన జెడ్పీటీసీలందరూ హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో కర్నూలు డీడీఓ అశ్వినీకుమార్ పాల్గొన్నారు.


