ఉన్న ఫలంగా ఎల్లెల్సీ నీరు బంద్ చేయడంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నీటిని కొనుగోలు చేసి మరీ పైర్లను తడుపుతున్నారు. బావుల దగ్గర, బోరు బావుల వద్ద నుంచి ట్యాంకర్లతో నీటిని కొని పైర్లకు తడులు కడుతున్నారు. పెద్దకడబూరులో ట్యాంకు నీరు రూ.100, ట్యాంకర్ బాడుగ రూ.వెయ్యి చొప్పున చెల్లించి మిరప పైర్లకు నీళ్లు పెడుతున్నారు. పెద్దకడబూరులో 01ఆర్ కాలువ పరిధిలో 300 ఎకరాలకు, నంబర్ 76 కాలువ పరిధిలో 200 ఎకరాలకు ఇలాగే చేస్తున్నారు. కాలువ పొడవునా ఇవే కష్టాలు దర్శనమిస్తున్నాయి. ఎకరానికి ఒక్క తడికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం. కౌతాళం పరిధిలోని ఉప్పరహాల్ గ్రామంలో రైతులు కాలువలో ఆగిన నీటిని ట్రాక్టర్లకు ఇంజిన్లు అమర్చుకుని పంటలు తడుపుకుంటున్నారు. ఖర్చు భారమైనా చేతికొచ్చిన పంట చేజారిపోతుందన్న ఆందోళనతో రైతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.


