కాలువ నీటిని నమ్ముకుని రెండు ఎకరాల్లో మిరప పంట వేశాను. అందుకు రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టాను. ప్రస్తుతం పైరు కాయలు పట్టి పండు దశకు వచ్చింది. ఉన్నపాటున కాలువ నీరు బంద్ చేశారు. 20 రోజులు నీరు పారి ఉంటే పంట చేతికొచ్చే అవకాశం ఉండేది. నీళ్లు లేనందున మా ఊరు పెద్దబావి నుంచి ఒక్కో ట్యాంకర్‌కు రూ.1100 చొప్పున వెచ్చించి నీళ్లు కట్టారు. అందుకు రూ.లక్షకు పైగా ఖర్చు వచ్చింది.
– ఆంజనేయ, రైతు, పెద్దకడబూరు
ఎల్లెల్సీ నీటిని నమ్ముకుని నాకున్న 3 ఎకరాల్లో మిరప వేశాను. పంట బాగానే ఉంది. మూడు ఎకరాలకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. నీరు పెట్టకపోతే పంటంతా ఎండిపోయె ప్రమాదం ఉంది. దీంతో నీటిని కొని పైరకు తడి పెడుతున్నా. పంట తడిపేందుకు రూ.85 వేల వరకు ఖర్చు వస్తుంది. మా ఊరంతా ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు.
– గుడిసె కృష్ణ, పెద్దకడబూరు
కాలువ కింద మాకు 2 ఎకరాలు ఉండగా మిరప వేశాను. ప్రస్తుతం పైరు కాయ పట్టే దశలో ఉంది. నీళ్లు రాకపోవడంతో పైరు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అందరిలాగే నేను కూడా నీళ్లు కొని పంటను తడిపాను. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మాపై దయ చూపాలి. లేదంటే మా ఒక్క గ్రామంలోనే దాదాపు 600 ఎకరాలు నాశనమయ్యేలా ఉంది.
– కోరి నాగరాజు, పెద్దకడబూరు


