తగ్గిన ఉల్లి ధరలు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ఉల్లి ధరలు

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

● క్వింటా రూ.3,889

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి ధరలు తగ్గాయి. మార్కెట్‌కు శుక్రవారం 5,438 క్వింటాళ్లు(209 లాట్లు) విక్రయానికి రాగా.. కనిష్ట ధర రూ.696, గరిష్ట ధర రూ.3,889 లభించగా.. సగటు ధర రూ.3,291 నమోదైంది. కాగా మొక్కజొన్న ధర పెరుగుతోంది. పంట లేకపోవడం వల్లే ధర పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్‌కు మొక్కజొన్నలు 87 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,182 లభించగా.. గరిష్ట ధర రూ.3059 లభించింది. వేరుశనగకు కనిష్ట ధర రూ.5312, గరిష్ట ధర రూ.9,369 లబించగా.. సగటు ధర రూ.7,861 పలికింది. మిర్చి రెడ్‌ రకానికి కనిష్ట ధర రూ.13,611, గరిష్ట ధర రూ.23,333 లభించగా.. సగటు ధర రూ.14,777 నమోదైంది.

కేఎంసీలో పెరిగిన పీజీ సీట్లు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కళాశాలలో 19 పీజీ సీట్లు పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టి నరసమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 188 పీజీ సీట్లు ఉన్నాయని, 19 పెరగడం ద్వారా 207కు చేరాయన్నారు. వీటితో పాటు కళాశాలలో 22 సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పెరిగిన వాటిలో జనరల్‌ సర్జరీ, అనెస్థీషియా, రేడియాలజీ, పీడియాట్రిక్‌, రేడియేషన్‌ ఆంకాలజీ ఉన్నాయన్నారు. వీటికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లభించిందన్నారు.

28న నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష

ఎమ్మిగనూరు రూరల్‌: మండల పరిధిలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ హరిష్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// cbseitms.rcll.gov.in/nvsవెబ్‌ ద్వారా హాల్‌ టికెట్స్‌ను పొందాలని చెప్పారు.

అనుమతుల్లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు

కర్నూలు: జిల్లాలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయించినా, నిల్వ ఉంచినా చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌ డివిజన్లలో టపాసుల విక్రయాలు జరిగే ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు తావు లేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయాలు జరుపుకోవాలని విక్రయదారులకు తెలియజేయాలని సూచించారు. కేటాయించిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు జరుపుకోవాలన్నారు. పోలీసు అధికారులు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దీపావళి పండుగ సజావుగా నిర్వహించే విధంగా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రమాదం చోటు చేసుకున్నా, టపాసులు అక్రమంగా విక్రయిస్తున్నా వెంటనే డయల్‌ 112 లేదా 100కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గొర్రెల పెంపకందారుల

శిక్షణా కేంద్రం పేరు మార్పు

● రాష్ట్ర నెమరు వేసే సన్నజీవాల

అభివృద్ధి సంస్థగా ఉత్తర్వులు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటైన గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో అప్పటి డోన్‌ ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రత్యేక చొరవతో ప్యాపిలి మండలంలోని డి.హుపేనాపురంలో గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు ఎకరాల భూమి కేటాయించి సొంత భవనాన్ని నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్‌లోనూ గణనీయంగా కోత పెట్టడం గమనార్హం. తాజాగా శిక్షణా కేంద్రం పేరును కూడా మార్పు చేసింది. ఇకపై రాష్ట్ర నెమరు వేసే సన్నజీవాల అభివృద్ధి సంస్థ(స్టేట్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ స్మాల్‌ రుమినెంట్‌ డెవలప్‌మెంటు–ఎస్‌ఐఎస్‌ఆర్‌డీ)గా వ్యవహరిస్తారు. ఈ కేంద్రంలో శిక్షణలు కూడా తగ్గిపోయాయి. గతంలో గొర్రెల పెంపకందారులకు నెలలో రెండు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇకపై నెలకు ఒక్క శిక్షణా కార్యక్రమం మాత్రమే నిర్వహించనుండటం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement