అతివేగానికి ఇద్దరు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఇద్దరు మృత్యువాత

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

● మదిరే వద్ద ఎదురెదురుగా

ఢీకొన్న బైక్‌లు

● ఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం

● మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఆదోని అర్బన్‌: అతివేగానికి ఇద్దరు బలయ్యారు. ఆదోని – సిరిగుప్ప రహదారిలో మదిరే గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్వీ ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హొళగుంద మండలం ఇంగళదహాల్‌ గ్రామానికి చెందిన దస్తగిరి, హోసూరమ్మ దంపతుల మొదటి కుమారుడు జయసోబు(18) అదే గ్రామానికి చెందిన మోహన్‌ ఆదోనిలో గుజిరీలో పని చేస్తూ రోజూ స్వగ్రామం నుంచి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో నందవరం మండలం కె.బాపురం గ్రామానికి చెందిన శివారెడ్డి(55), ఆదోని పట్టణంలోని చిన్న మార్కెట్‌కు చెందిన అయూబ్‌ మరో బైక్‌పై కర్ణాటక రాష్ట్రం సిరిగుప్ప నుంచి ఆదోని వైపు వస్తున్నారు. వేగంగా వస్తున్న రెండు బైకులు ఆదోని మండలం మదిరే గ్రామ క్రాస్‌ రోడ్డు సమీపంలో ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు బైక్‌లపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయసోబు, శివారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలపాలైన అయూబ్‌, మోహన్‌లను మెరుగైన చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆదోని ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. జయసోబు తల్లిదండ్రులకు మొదటి సంతానం కాగా, శివారెడ్డి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య కవితారెడ్డి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మృతిచెందిన జయసోబు, శివరామ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement