కోసిగి: ఆర్లబండ గ్రామంలో శుక్రవారం పోలింగ్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఏఆర్ ఏఎస్పీ కృష్ణమోహన్, ఎమ్మిగనూరు డీఎస్పీ ఆముదాల శ్రీనివాస్, కర్నూలు మహిళా డీఎస్పీ ఉపేంద్రబాబు, ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది సివిల్ పోలీసులు, 63 మంది స్పెషల్ పార్టీ ట్రైనింగ్ పోలీసులు, 35 మంది స్పెషల్ పార్టీ, 9 మంది మహిళా పోలీసులు మొత్తం 158 మంది బందోబస్తు మధ్య రీపోలింగ్ నిర్వహించారు. గురువారం ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామంలో 2/2 పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడడంతో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం గ్రామ శివారు నుంచి ఎవరు బయట వ్యక్తులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ బూత్‌లో 954 ఓట్లు ఉండగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకరాజు, ఆదోని ఆర్డీఓ అరుణాదేవి ఆధ్వర్యంలో పోలింగ్‌ను ఉదయం 7 గంటలకు ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి 595 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 317 మంది, మహిళలు 278 మంది ఓటు వేయగా 62.37 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాన్ని జెడ్పీ సీఈఓ సుధాకర్, మంత్రాలయం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఓబులేష్ పర్యవేక్షించారు. అలాగే వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పాలేగర్ శ్యాంసుందర్ రాజు, టీడీపీ జడ్‌పీటీసీ అభ్యర్థి గిరయ్యగారి జ్ఞానేష్‌లు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.


