కర్నూలు(అర్బన్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ఈ నెల 31 నుంచి మండలాలకు పంపనున్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి/జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేది నుంచి స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించామన్నారు. అన్ని మండలాలకు నవంబర్ 1వ తేది నాటికి చేర్చే విధంగా కార్యచరణను రూపొందించినట్లు చెప్పారు. జిల్లాలోని 1,432 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 26 మండలాల్లో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు 9,030 మంది పీఓ, ఏపీఓ తదితర సిబ్బంది, ఓట్ల లెక్కింపుకు 2,172 మందిని నియమించామన్నారు. అన్ని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలను చేపట్టామన్నారు.
నేడు, రేపు మార్కెట్‌కు సెలవు
కర్నూలు(అగ్రికల్చర్): అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ నెల 31, నవంబర్ 1వ తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మార్కెట్ యార్డులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, ఇందువల్ల మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు ప్రకటించామన్నారు. ఆయా రోజుల్లో మార్కెట్‌లో ఎలాంటి క్రయవిక్రయాలు జరుగవని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరోసారి ‘సర్’ గడువు పొడిగింపు
● నవంబర్ 30న
తుది ఓటరు జబితా ప్రచురణ
కర్నూలు(సెంట్రల్): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) గడువును మరోసారి పొడిగించారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారానికి నవంబర్ 20వ తేదీ వరకు గడువు పొడిగించగా తుది జాబితాను నవంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పొడిగించిన గడువును ప్రతి అర్హత కలిగిన ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల ఇంటింట సర్వే సమయంలో ఇంట్లో లేని వారు లేదా తమ వివరాలు నమోదు కాలేదని భావించే వారు సంబంధిత బీఎల్‌ఓ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ కార్యాలయాలను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
2, 3 తేదీల్లో సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రాంతాల్లో నవంబర్ 2, 3 తేదీల్లో సెంట్రల్ టీం పర్యటించనుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఎన్‌డీఆర్‌ఎప్, ఎస్‌డీఆర్‌ఎప్ కింద పంట నష్టంపై ప్రిలిమినరీ రిపోర్టును ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదిక కేంద్రానికి చేరింది. ఈ నేపథ్యంలో కరువు మండలాల్లో కేంద్ర ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. రాష్ట్రానికి రెండు సెంట్రల్ టీంలు రానున్నాయి. ఇందులో టీం–1 ఉమ్మడి జిల్లాలో పర్యటించనుంది. 2వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కర్నూలు జిల్లాలో పర్యటించి కరువు తీవ్రతను పరిశీలిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నంద్యాల జిల్లాలో పర్యటించనున్న టీమ్ ఆ తర్వాత మార్కాపురం జిల్లాకు వెళ్లనున్నారు.
20 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటు వేయవచ్చు
● జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సంఘం సూచించిన 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపి నవంబర్ 1న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ సిరి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆధార్, పాన్, ఫొటోతో కూడిన ఏటీఎం, రేషన్, ఉపాధి హామీ జాబ్ కార్డులు చూపవచ్చని పేర్కొన్నారు. అలాగే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయవచ్చన్నారు. ఫొటోతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్, మాజీ సైనికుల పెన్షన్ పుస్తకం, వద్ధాప్య, వితంతు పెన్షన్ పత్రాలు, ఫొటోతో కూడిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలు కూడా చూపవచ్చని తెలిపారు. ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


