● కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా ● జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్, డీఆర్వోకు వినతిపత్రం
కర్నూలు(సెంట్రల్): సాక్షి ఆత్మకూరు రూరల్ రిపోర్టర్ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం అన్యాయమని, వెంటనే అతనిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.శివశంకర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి శ్రీనివాసగౌడ్, ఐజేయూ నాయకుడు సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఇంట్లో ఉన్న అతనిపై దాడులకు తెగబడి చంపే ప్రయత్నం చేయడం ఘోరమని, కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద సంఖ్యలో జర్నలిస్టులతో కలసి ఆయా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవకపోవడంలో విఫలమైందన్నారు. ఆత్మకూరులో ఇంట్లో ఉన్న సాక్షి విలేకరి సుబ్బారెడ్డిపై తెల్లవారుజామున చొరబడి చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు వెంటనే రక్షణ చట్టం తేవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో హోంమంత్రి, డీజీపీ అధ్వర్యంలో, జిల్లా స్థాయిలో ఎస్పీ ఆధ్వర్యంలో రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సి. వెంకటనారాయణమ్మను కలసి వినతిపత్రం సమర్పించారు.
డీఎస్పీ రామాంజినాయక్ తీరుపై
అనుమానం
ఆత్మకూరు సాక్షి విలేకరి సుబ్బారెడ్డిపై దాడి జరగడంలో పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.శివశంకర్, సీనియర్ రిపోర్టర్ హుస్సేన్ పేర్కొన్నారు. సుబ్బారెడ్డిపై దాడి జరుగుతుందని గురువారం రాత్రి డీఎస్పీ రామాంజి నాయక్ ఫోన్ చేసి హెచ్చరించిన గంటల తరువాతే దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలీసులకు ముందే తెలిసినా ఎందుకు సుబ్బారెడ్డికి రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా పోలీసులు తమ తీరును మార్చుకొని జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరారు. లేదంటే జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ధర్నాలో సీనియర్ జర్నలిస్టులు చంద్రశేఖర్, నాగిరెడ్డి, బీవీ రమణారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రామచంద్రారెడ్డి, మధుసుధాకర్, డి.హుస్సేన్, రవిప్రకాష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


