● అన్యాయంగా అరెస్టులు చేస్తే
ప్రతిఘటించండి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): మంత్రి టీజీ భరత్ ఆదేశాలతోనే కర్నూలులో వేలాది సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదుచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా మంత్రి టీజీ భరత్ వ్యవహరిస్తున్నారన్నారు. ఓటమి భయం లేకుండా ఎందుకు పోలీసులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. కర్నూలులో ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారులు నేరుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో మాట్లాడి తప్పుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. మంత్రి టీజీ భరత్ నుంచి తీవ్ర మైన ఒత్తిడి ఉందని, తప్పుకుంటే రూ. 20 లక్షలు ఇప్పిస్తామని చెప్పడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.
ప్రతిష్టను దిగజార్చుకోవద్దు
మరో రెండేళ్ల తరువాత ప్రభుత్వం మారుతుందని, పోలీసు అధికారులు ఉంటారని, అప్పుడు ఇబ్బందులు తప్పవని ఎస్వీ హెచ్చరించారు. పోలీసులు ప్రతిష్ట దిగజార్చుకోవద్దని సూచించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎలాంటి కేసులు లేకుండా అరెస్టు చేస్తామంటే ప్రతిఘటించాలన్నారు. అరెస్టు చేస్తామని వచ్చే పోలీసులకు సంబంధించిన వీడియోలు తీయాలని, వాటిని ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో లీగల్‌గా పోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు పనిచేయాలని, కేవలం మంత్రి టీజీ భరత్, ప్రజాప్రతినిధుల కోసం ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి టీజీ భరత్ అప్రజాస్వామ్య విధానాలకు పాల్పడుతున్నారన్నారు.


