దేవస్థానం అధికారులపై సాధు–సంత్‌ల ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం అధికారులపై సాధు–సంత్‌ల ఫిర్యాదు

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

శ్రీశైలం: శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉన్న సాధు–సంత్‌లను ఈనెల 9న లారీలో ఎక్కించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని బైపాస్‌ రోడ్‌లో వదిలివేయడంపై వారు శనివారం వన్‌ టౌన్‌ ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. శివోహం ట్రస్ట్‌ అధినేత అరవింద్‌ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సాధు–సంత్‌వులు ఎస్‌ఐని కలిసి తమకు జరిగిన అవమానాన్ని ఏకరువు పెట్టారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మునుగోటి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సహాయ కార్య నిర్వహణ అధికారి ఫణిధర ప్రసాద్‌ తమను బలవంతంగా అపరిశుభ్రమైన లారీలో ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీరు ఇవ్వలేదని, తినడానికి తిండి లేదని, మలమూత్ర విసర్జనకు కూడా అనుమతించకుండా ఒంగోలు బైపాస్‌ రోడ్‌ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారని వాపోయారు. దేవస్థానం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు కాపీలను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆత్మకూరు డీఎస్పీలకు పంపించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆలయంలో వెండి మాయం

నందికొట్కూరు: మండల పరిధిలోని దామగట్ల గ్రామ సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడిలోని 70 తులాల వెండి మాయమైంది. శనివారం ఉదయం ఆలయ పూజారి సుధాకర్‌ శర్మ గుడి వద్దకు పూజ కోసం వెళ్లగా అమ్మవారి వెండి తొడుగు కనిపించకపోవడంతో గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌లో పూజారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ మణికంఠ తెలిపారు.

కేసు నమోదు

బనగానపల్లె రూరల్‌: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్‌పై దాడి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భూపాలుడు శనివారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య గ్రామంలోని హోటల్‌ వద్ద కూర్చొని ఉండగా పాతకక్షలు మనసులో పెట్టుకొని ప్రభాకర్‌తో పాటు అతని భార్య, అత్త కలిసి దుర్బాషలాడి దాడి చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు కింద పడి

మహిళ ఆత్మహత్య

ఆదోని సెంట్రల్‌/కోసిగి: గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ మల్లేశ్వరయ్య తెలిపిన వివరాలు.. ఆదోని డివిజన్‌ పరిధిలోని కుప్పగల్‌–కోసిగి రైల్వే స్టేషన్ల మధ్య కిలో మీటరు నంబర్‌. 510/10–12 డౌన్‌లైన్‌ ట్రాక్‌ వద్ద సీసీహెచ్‌/ఎన్‌ఎంజీ గూడ్స్‌ రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ మల్లేశ్వరయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాదాపు 75 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఆకుపచ్చ చీర, నల్లని, తెల్లని పూల డిజైన్‌ జాకెట్‌ వేసుకుందని, ఎవరికై నా ఆమె వివరాలు తెలిస్తే తమకు తెలపాలని ఎస్‌ఐ కోరారు.

వృద్ధురాలు..

డోన్‌ టౌన్‌: పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫారం1లో ఉన్న విశ్రాంతి గదికి ఎదురుగా గుర్తు తెలియని వృద్ధురాలు మృతిచెందినట్లు శనివారం రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. ఎవరికై నా మృతురాలి వివరాలు తెలిస్తే 924757610 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో..

గూడూరు: కే.నాగాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో కర్నూలు–బళ్లారి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

చికెన్‌ ఇవ్వలేదని కర్రతో దాడి

మహానంది: చికెన్‌ షాపుకు వెళ్లి చికెన్‌ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో కర్రతో దాడి చేయగా ఒకరికి గాయమైంది. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మహానందికి చెందిన మహేష్‌ స్థానికంగా ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఎంసీ ఫారం గ్రామానికి చెందిన శ్యామ్‌ శనివారం చికెన్‌ సెంటర్‌ వద్దకు వచ్చి చికెన్‌ అడిగాడు. డబ్బు ఇస్తేనే చికెన్‌ ఇస్తానని అనడంతో ఆగ్రహించిన శ్యామ్‌ కర్రతో దాడి చేయగా మహేష్‌ తలకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement