మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ ఇంట్లో తీవ్ర విషాదం | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

● అమెరికాలో ఉంటున్న కుమారుడు

కిరణ్‌ గుండెపోటుతో మృతి

● సానుభూతి తెలిపిన రాజకీయ

నాయకులు, అధికారులు

కర్నూలు(సెంట్రల్‌): సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ ఇంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ హోసేలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్న పెద్ద కుమారుడు కిరణ్‌ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఎంఏ గఫూరు, నిర్మలమ్మ దంపతులు తీవ్ర విషాధంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తనం కాలేదు. త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవడం తీవ్ర బాధాకరం. కాగా, వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తుండగా...చిన్న కుమారుడు అరుణ్‌ కర్నూలు కిమ్స్‌లో డాక్టరుగా పనిచేస్తున్నాడు.

అమెరికాలోలోనే భౌతికకాయం

మద్రాస్‌ ఐఐటీలో ఎమ్‌టెక్‌ పూర్తి చేసిన కిరణ్‌ (41) కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌హోసేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా అమెజాన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్టోబర్‌ 1న కిరణ్‌కు తన నివాసంలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడ నివాసం ఉంటున్న స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు తల్లిదండ్రులకు, పనిచేస్తున్న కంపెనీకి తెలియజేయలేదు. ఈ క్రమంలో శుక్రవారం వరకు కిరణ్‌ విధులకు రాకపోవడం, అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఉంటుండడంతో ఇండియాలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ’అమనా’, ’తానా’ సంస్థల సహకారం తీసుకున్నారు. వారు వెంటనే స్పందించి స్థానికంగా విచారణ జరిపి అక్టోబర్‌ 1నే కిరణ్‌ మరణించినట్లు నిర్ధారించారు. సమీపంలోని ఆసుపత్రి మార్చురీలో కిరన్‌ మృతదేహం ఉన్నట్లు సమాచారం ఇచ్చారు.

వారం రోజులు పట్టే అవకాశం...

కిరణ్‌ భౌతికకాయాన్ని తిరిగి సొంత ఊరైన కర్నూలుకు తీసుకురావడానికి అవసరమైన దౌత్యపరమైన ప్రక్రియలు, రవాణా ఏర్పాట్లలో అమనా, తానా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం అమెరికాలో మూడు రోజుల వరుస సెలవుల కారణంగా భౌతికకాయం కర్నూలుకు చేరడానికి సుమారు వారం రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

అమ్మానాన్న సొంత కారులో

తిప్పాలని ఉంది రా..

అమ్మాన్నాన్నను సొంత కారులో తిప్పాలని ఉందిరా తమ్ముడు అంటూ అరుణ్‌కు చివరి సారిగా సెప్టెంబర్‌ 28వ తేదీన కిరణ్‌ ఫోన్‌ చేసి చెప్పినట్లు ఎంఏ గఫూర్‌ తెలిపారు. త్వరలోనే ఇండియాకి వచ్చి ఆ పని చేస్తానని చెప్పాడని, అందుకు ఎంతో సంతోషం వేసిందన్నారు. ఇంతలోనే మరణ వార్త వినడం దురదృష్టకరమని, ఇలాంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకు కలుగకూడదని చెప్పారు. మరోవైపు తన తమ్ముడితో ఆ రోజు చాలా సమయం మాట్లాడి జీవితంలో ధైరంగా ఉండాలనే విషయాలు చెప్పినట్లు వివరించారు. కాగా, గతంలో ఎప్పుడూ కిరణ్‌ గుండెకు సంబంధించిన వ్యాధులు, పోటు రావడం లేవని, అనుకోకుండా వచ్చి ఒక్కసారిగానే ప్రాణాలు తీసిందని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా సానుభూతి

ఎంఏ గఫూరు, నిర్మలమ్మల కుమారుడు కిరణ్‌ మృతికి రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీమోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి, టీడీపీ నాయకుడు వాయిద్‌ హుస్సేన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, కాంగ్రెస్‌ నాయకుడు లక్ష్మీనరసింహ, సీనియర్‌ అడ్వొకేట్‌ జయరాజు, సీఐ శ్రీనాథ్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. తమ ప్రగాఘ సానుభూతిని ఎంఏ గఫూర దంపతులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement