క్రిష్ణగిరి బరిలో లేని టీడీపీ | - | Sakshi
Sakshi News home page

క్రిష్ణగిరి బరిలో లేని టీడీపీ

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ స్థానాలు

25 ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పోటీ

68 మంది విత్‌డ్రా, బరిలో 97 మంది

పలు ప్రాంతాల్లో ఏకగ్రీవాలకు పారని టీడీపీ పాచిక

ఆరు స్థానాల్లో ముఖాముఖి

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ(జెడ్పీటీసీ) ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థులకు దీటుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. పలు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేసినా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోకుండా పోటీకి సిద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, పలు కారణాల వల్ల వెల్దుర్తి జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నందున ఈ స్థానంలో ఎన్నిక జరగనుంది. మిగిలిన 25 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన బలమైన అభ్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు. గత రెండు, మూడు రోజులుగా పలు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయంట, అక్కడ రాజీ కుదిరిందంట అనే అబద్ధ్దపు ప్రచారాలను చేయించారు. మంగళవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయా జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసిన అభ్యర్థులంద రూ వైఎస్సార్‌సీపీ బీఫారాలను అందించి తామెక్కడా, ఎవరితోనూ రాజీ కావడం లేదని నిరూపించారు.

జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 97 మంది

జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 98 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగిన నామినేషన్లు స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 198 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో పరిశీలన సందర్భంగా 33 నామినేషన్లను అనర్హత కలిగినవిగా అధికారులు నిర్ధారించారు. మిగిలిన 165 నామినేషన్లలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు 68 మంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోగా 97 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఆరు స్థానాల్లో ముఖాముఖి

26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఆరు స్థానాల్లో ముఖాముఖి పోరు ఉండనుంది. చిప్పగిరి, గూడురు, హాలహర్వి, కోడుమూరు, కర్నూలు, వెల్దుర్తి స్థానాల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కాగా, హాలహర్విలో బీజేపీ, వైఎస్సార్‌సీపీ.. వెల్దుర్తిలో బీఎస్‌పీ, టీడీపీ మధ్య పోటీ జరగనుంది. మిగిలిన నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంది.

జెడ్పీటీసీ ఎన్నికల్లో నువ్వానేనా !

జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన క్రిష్ణగిరి జెడ్పీటీసీ స్థానం నుంచి అధికార తెలుగుదేశం పార్టీ పోటీలో లేనట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఈ స్థానానికి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ తనయుడు కేఈ రుద్రఫణిగౌడ్‌ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖా లు చేశారు. అయితే ఆయన గ్రామీణ ఓటరుగా నమోదు కాకపోవడం వల్ల నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు అధికారులు తేల్చారు. ఈ స్థానానికి మొత్తం ఏడు నామినేషన్లు దాఖాలు కాగా, పరిశీలనలో ఐదు నామినేషన్లు అర్హత సాధించా యి. వీటిలో ఒకరు విత్‌డ్రా చేసుకోగా, నలుగురు అభ్యర్థులు బరిలో మిగిలారు. ఒకరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాగా, మిగిలిన ముగ్గురు స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. అలాగే ఆదోని – 1, ఆస్పరి, ఎమ్మిగనూరు జెడ్పీటీసీ స్థానాల నుంచి జనసేన, హొళగుందలో బీజేపీ, కౌతాళంలో బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement