కర్నూలు(హాస్పిటల్): జాతీయ యువజన దినోత్సవం(స్వామి వివేకానంద జయంతి)ని పురస్కరించుకుని వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులైన యువత ముందుకు రావాలని జిల్లా యువజన అధికారి(మై భారత్ కేంద్ర) కర్నూలు అధికారి పి.ఐజయ్య కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువత అర్హులన్నారు. ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారన్నారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ ట్రాక్, సాంస్కృతిక విభాగం(జానపద గీతం/నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం), డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్, యూత్ ఎంట్రపెన్యూర్ ఛాలెంజ్, యూత్ పార్లమెంట్ విభాగాలు ఉంటాయన్నారు. ఈ విభాగాల్లో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచిన వారు జనవరి 12 నుంచి న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. పై ఆరు విభాగాల్లో సాంస్కృతిక విభాగం మినహా ఇతర ఐదు విభాగాల పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు అధికారిక పోర్టల్ mybharat.gov.inను సందర్శించాలన్నారు.


