కర్నూలు(టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 104 ఫిర్యాదులు అందాయన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలీలు పాల్గొన్నారు.
కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16వ తేదీ ఆఖరు
కర్నూలు(సెంట్రల్): కొత్త పింఛన్లకు అర్హులు ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై అధికారులకు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ని ర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అందజేస్తారన్నారు.
క్వింటా ఉల్లి రూ.4,739
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 1,224 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.1,843, గరిష్ట ధర రూ.4,739 లభించింది. మార్కెట్ యార్డులో 33 లాట్ల ఉల్లి ఉండగా.. ఎక్కువ లాట్లకు రూ.4వేల పైనే ధర దక్కింది. రైతుబజార్లలో అంతంతమాత్రం నాణ్యత ఉన్న ఉల్లినే రూ. 46–56 ప్రకారం విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిగడ్డలను నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. ఉల్లి ధరలు పెరిగి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేరుశనగ ధర కూడా పెరుగుతోంది. కర్నూలు మార్కెట్‌లో వేరుశనగ గరిష్ట ధర రూ.9,426, ఆదోని మార్కెట్‌లో రూ.9,688, ఎమ్మిగనూరు మార్కెట్‌లో రూ.7,630 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్‌కు పత్తి 6,578 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,011, గరిష్ట ధర రూ.9,959 లభించగా.. సగటు ధర రూ.9,789 పలికింది.
జవాబుదారీతనంతో సేవలు అందించండి
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పుడే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈఈలు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను సోమవారం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రచురించారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల గుర్తింపు ప్రక్రియ గత 18వ తేదిన ప్రారంభించి 24వ తేది వరకు కొనసాగించారు. అనంతరం గుర్తించిన ఓటరు జాబితాలను అదే నెల 25న డ్రాఫ్డ్ పబ్లికేషన్ చేశారు. 26 నుంచి 28వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సభలను నిర్వహించి ఈ నెల 6న తుది జాబితాలను సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయిలోని పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు.


