ప్రభుత్వం ఎంత బకాయి పడిందంటే ...
తమకు అందించాల్సిన గౌరవ వేతనాలను పూర్తి స్థాయిలో పెండింగ్‌లో పెట్టడంతో జెడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పలుమార్లు జెడ్పీ సీఈఓ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి వేతనాలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తమకు కూడా వేతనాలను అందించాలని ఉమ్మ డి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు కోరుతున్నారు. మరో ఇరవై రోజుల్లో తమ పదవీ కాలం పూర్తి అవుతున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉంచిన గౌరవ వేతనాలను చెల్లించాలని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
కర్నూలు(అర్బన్): ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారంతా.. పాలనా పరమైన అంశాల్లో వారి ఆమోదం (కోరం) తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని చంద్రబాబు ప్రభుత్వం కరివేపాకులా తీసి పారేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ చిన్న చూపు చూస్తోంది. మరో ఇరవై రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం వేతనాల రూపంలో వీరికి కోట్ల రూపాయలను బకాయి పెట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందించే గౌరవ వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
అదే తంతు!
‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచుతాం.. స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెస్తాం’.. అని టీడీపీ అధినే చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వేతనం పెంచడం దేవుడెరుగు పదవీకాలం ముగుస్తున్నా గౌరవ వేతనాన్ని ఇవ్వకుండా ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా వేధించారు. హోదాలో జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా పరిషత్ చైర్మన్‌కు ప్రభుత్వం నెలకు రూ.40 వేలు, జెడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేలు, మండల పరిషత్ అధ్యక్షులకు రూ.6 వేలు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు (ఎంపీటీసీలకు) రూ.3 వేలను గౌరవ వేతనంగా అందించాల్సి ఉంది. ఈ మొత్తం కేవలం వారి హోదాను గౌరవించి ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనాలపై పెదవి విప్పడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతూ వచ్చాయి. 2024 ఎన్నికల కంటే ముందు మూడు, నాలుగు నెలలు మినహా మిగిలిన ఐదు సంవత్సరాల్లో గౌరవ వేతనాలను రెగ్యులర్‌గా విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 27 నెలలుగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
పలు సమావేశాల్లో అడుగుతున్నా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో జరుగతున్న మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తమ వేతనాలకు సంబంధించి పలు మార్లు ప్రశ్నిస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, నేటి వరకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కూడా పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పలుమార్లు పీఆర్‌అండ్‌ఆర్‌డీ కార్యాలయానికి కరస్పాండెన్స్ జరుగుతున్నా, వేతనాలు విడుదల చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది.
జెడ్పీటీసీలకు అందించాల్సిన గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేశాం. గతంలో జెడ్పీటీసీలు అందించిన వినతి పత్రాలను కూడా ప్రభుత్వానికి పంపించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.
– ఆర్.సుధాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ
అధికారిక లెక్కల ప్రకారం జెడ్పీ చైర్మన్‌తో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు
ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు నెల వరకు రూ.10,38,11,463లను బకాయి పడింది.
జెడ్పీ చైర్మన్‌కు నెలకు రూ.40 వేల ప్రకారం 27 నెలలకు రూ.10.80 లక్షలు
52 మంది జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులకు నెలకు రూ.6 వేల ప్రకారం
27 నెలలకు రూ. 87.48లక్షలు
53 మంది ఎంపీపీ, 778 మంది ఎంపీటీసీలకు రూ.7,16,04,000
స్థానిక ప్రజాప్రతినిధులపై
చంద్రబాబు ప్రభుత్వం ‘చిన్న చూపు’
జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులకు
27 నెలలుగా అందని గౌరవ వేతనం
ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులదీ
ఇదే పరిస్థితి
వీరికి ప్రభుత్వం చెల్లించాల్సింది
రూ.8.95 కోట్లు
మొత్తంగా రూ. 10.38 కోట్లు పెండింగ్
మరో 20 రోజుల్లో ముగియనున్న
స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం


