పత్తికొండ: మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో రోజుకో అక్రమం బయటకొస్తున్నా స్పందించేందుకు ఆ పార్టీ పెద్దలు జంకుతున్నారన్నారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ప్రభాకర్ కౌతాళం మండలం వల్లూరులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఇతను టెట్‌లో అర్హత సాధించలేదని, ఎక్కడా పోటీల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవన్నారు. మరి ఆయనకు డీఎస్సీలో ఎలా ఉద్యోగం వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. కమతం రమ్యశ్రీ, బంగారు మౌనిక 2018లో డీఎస్సీ రాసినప్పుడు బీసీ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2025 మెగా డీఎస్సీలో మరో కేటగిరిలో దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందారన్నారు. అది కూడా వారికి 75లోపు మార్కులు వచ్చాయని, ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో కులాలు మార్చుకుని ఉద్యోగాలు పొందుతున్న వింత ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. కూటమి పెద్దల సహకారంతో నకలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్‌లు సమర్పించి అడ్డదారిలో ఇలాంటి వారు ఎందరో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. అది కూడా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చురుకుగా పొల్గొన్న వారికి అక్రమ దారిలో ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. అక్రమాలపై విచారణ పారదర్శకంగా చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎంపీపీ నారాయణ్‌దాస్ పాల్గొన్నారు.


