● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్‌పై బాబాయి కొడుకు ఆకాష్‌తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్‌ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.7,630
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,630 ధర పలికింది. మార్కెట్‌కు 39 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. కనిష్ట ధర రూ.7,410 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన ఈ సందర్భంగా తెలిపారు.
కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారుల ప్రతిభ
కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
తల్లిని కాపాడే ప్రయత్నంలో..
● తండ్రిపై కుమారుడి దాడి
● తీవ్ర గాయాలై తండ్రి మృతి
వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్‌లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్‌బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్‌వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


