కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

తుంభద్రమ్మ ఒడిలో

ఓలలాలిడిన స్వామి వారు

బ్రహ్మరథం పట్టిన భక్తులు

కోసిగి/మంత్రాలయం: ఏటి గట్టున భక్తజనం వీక్షిస్తుండగా.. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈరన్న స్వామి తుంగభద్రమ్మ ఒడిలో ఓలలాడారు. నృసింహుని పుణ్యస్నానంతో ఆధ్యాత్మిక తరంగాలతో తుంగభద్రమ్మ పరవశించింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీనరసింహ స్వామి) పల్లకోత్సవం చివరి సోమవారం కడు వైభవంగా సాగింది. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామి వారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా ఉరుకుంద నుంచి కోసిగి మండలం కందుకూరు గ్రామం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్రనది చెంతకు చేరారు. ముందుగా ఆలయ డిప్యూటీ కమిషనర్‌ కె. వాణి ఆధ్వర్యంలో తుంగభద్రమ్మకు హారతులు పట్టి సారె సమర్పించారు. అనంతరం నరసింహా స్వామికి జై.. అంటూ .. స్వామి వారికి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నది ఒడ్డున దింపుడు కట్టపై స్వామి వారిని కొలువుంచి అభిషేకాలు గావించి మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామి వారికి నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరిగి యథావిధిగా పల్లకీలో ఊరేగింపుగా బయలు దేరారు. కందుకూరు గ్రామంలో స్వామి వారికి మేళతాళాలతో డప్పువాయిద్యాలతో గ్రామ ప్రజలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కామన్‌దొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, గ్రామాల మీదుగా ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర రావు, రామ్మోహన్‌, ఉపప్రధాన అర్చకులు మహాదేవప్ప, సీనియర్‌ అసిస్టెంట్‌ వీరేష్‌లు ఉన్నారు. పల్లకోత్సవం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోసిగి, కౌతాళం సీఐలు మంజునాథ్‌, యుగంధర్‌, కోసిగి, ఎమ్మిగనూరు రూరల్‌, పెద్దకడబూరు ఎస్‌ఐలు రమేష్‌ రెడ్డి, శ్రీనివాసులు, మారుతి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఊరూరా జాతర

ఈరన్న స్వామి పల్లకీ చేరుకున్న గ్రామాల్లో జాతరను తలపించింది. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పల్లకీ చేరుకోగా స్వామి పాదాల చెంత భక్తులు నీటితో పాదాభిషేకం చేయగా, అడుగడునా కోక పాన్పులు పరుచగా పల్లకీ ముందుకు సాగింది. భక్తులు అడుగడునా నారికేళాలు సమర్పించి పూజలు చేపట్టారు. స్వామి పల్లకీ ముందుకు సాగిన గ్రామాల్లో గాజులు, మిఠాయి అంగళ్లు, చిన్నారుల రంగుల రాట్నాలు, బొమ్మలు అంగళ్లతో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement