హత్యాయత్నం కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసు ఛేదన

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

మున్సిపల్‌ పారిశుద్ధ్య

కార్మికురాలిపై దాడికి పాల్పడిన

ఆరుగురు నిందితుల అరెస్ట్‌

ఆదోని అర్బన్‌: మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై జరిగిన హత్యాయత్నం కేసును ఆదోని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ వెంకటరమణ, టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నరసమ్మ భర్త శీను ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం మున్సిపాలిటీలో శీను ఉద్యోగం నరసమ్మకు లభించగా, అక్కడే పనిచేస్తున్న చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈరన్న స్థానిక అమరావతినగర్‌కు చెందిన శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నరసమ్మతో ఉన్న సంబంధాన్ని ఈరన్న కొనసాగించడానికి ప్రయత్నించడంతో అతని కుటుంబీకులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో నరసమ్మపై గతంలో శిరీష తన కుటుంబీకులతో కలసి దాడి చేసింది. వారిపై నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసులయ్యాయి. దీంతో పెద్దలతో పంచాయతీ జరిపిన అనంతరం ఈరన్న, శిరీష సాయిబాబానగర్‌లో ఉంటున్నారు. నరసమ్మతో దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులతో మనస్తాపానికి గురైన ఈరన్న ఈ ఏడాది జూలై 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరన్న మృతికి నరసమ్మనే కారణమని భావించిన శిరీష కక్ష పెంచుకుని హత్య చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై శిరీష, ఆమె తల్లి సుజాత, అత్తామామలు రాములమ్మ, ఈరన్న, ఆడబిడ్డ హేమ, చిన్నమ్మ అంజినమ్మలు దాడి చేశారు. కంట్లో కారం చల్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. నరసమ్మ కేకలు వేయడంతో సహ ఉద్యోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 70 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కదలికలను గమనించి, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అమరావతినగర్‌ రోడ్డు, బసాపురం జంక్షన్‌ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును 24 గంటల్లోపు చేధించిన టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని అభినందించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement