ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి! | - | Sakshi
Sakshi News home page

ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

వృద్ధురాలిపై దాడి చేసి బంగారు

నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్‌

నిందితుడి నుంచి

బంగారు నగలు, బైక్‌ రికవరీ

సి.బెళగల్‌: ఐదు రోజుల క్రితం సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మండల కేంద్రం సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్నగా గుర్తించి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సి.బెళగల్‌ పోలీసు స్టేషన్‌లో కోడుమూరు సీఐ త్రబేజ్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజుతో కలిసి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. సీఐ వివరాల మేరకు.. సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్న ఇంటి వద్ద వ్యవసాయ పనులు, జీవాలను పోషిస్తున్నాడు. ఇతను సమీపంలోని సంగాల గ్రామంలో ధ్యాన పిరమిడ్‌ కేంద్రానికి వెళ్లేవాడు. కాగా ధ్యాన కేంద్రం పక్కనే ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు ఇల్లూరి సంజీవమ్మ ధ్యాన పిరమిడ్‌లో నిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉండేది. ఈ క్రమంలో వృద్ధురాలిని రంగన్న పరిచయం చేసుకుని ఆమె ఇంటిపై నిఘా ఉంచాడు. రోజూ ఆమె కదలికలను గమనిస్తూ ఆమె వద్ద ఉన్న నగలను దోచుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ ఉదయం హెల్మెట్‌ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్‌తో చంపుతా అంటూ వృద్ధురాలిని బెదిరించి, తర్వాత దాడి చేసి బంగారు గొలుసు, రెండు బంగారు గాజులను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి.బెళగల్‌ పోలీసులు విచారణ చేపట్టి దొంగతనానికి పాల్పడిన రంగన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.9 తులాల బరువున్న రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు చోరీకి ఉపయోగించిన బైకు, హెల్మెట్‌, ఇనుపరాడ్‌, ఇతర వస్తువులను నిందితుడిని నుంచి సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా కేసును త్వరగా ఛేదించిన ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు, కానిస్టేబుల్‌ శ్రీనివాసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కేసు ఛేదనలో ప్రతిభ చూపిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, జానకిరాముడులను సీఐ, ఎస్‌ఐలు రివార్డుతో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement