గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు. సోమవారం కేవీకే బనవాసి ఆధ్వర్యంలో తాడిపత్రి జేసి దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం 10 మంది విద్యార్థులతో కలసి పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాల్లో పీఆర్‌ఏ పద్ధతులపై గ్రామీణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి గ్రామ పటం, రిసోర్స్ మ్యాపింగ్, ప్రాబ్లమ్ ట్రీ వంటి పీఆర్‌ఏ పద్ధతులను వివరించారు. మిరప, పత్తి, ఉల్లి తదితర పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు పసుపు నీలం జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్తిలో 13–0–45, మెగ్నీషి యం సల్ఫెట్ పిచికారి, వీఏఎం వినియోగం ద్వారా మొక్కల ఒత్తిడి తట్టుకునే శక్తి, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఉల్లిలో తామర పురుగు, ఆకు మాడు సమస్యలకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఆధారిత జీవ నియంత్రణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.


