భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్‌ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్‌గౌడ్(26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్‌గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు.
వివాహానికి వెళ్తుండగా విషాదం
మృతుడు హరీశ్‌గౌడ్ హైదరాబాద్‌లో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య కల్యాణితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


