ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్‌

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

● బస్సు టైర్‌ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి

● బస్సు టైర్‌ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి

పత్తికొండ: గమ్యస్థానాలకు చేరకుండా మార్గం మధ్యలోనే మరమ్మతులకు గురై ఆగిపోతూ ఆర్టీసీ బస్సులు హడలెత్తిస్తున్న సంఘటనలతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి ఆదోనికి బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఏపీ 39 యూఎస్‌ 5609 నంబరు గల బస్సు దేవనబండ–ఆటికెలగుండు గ్రామాల మధ్య టైర్‌ పేలడంతో ఆగిపోయింది. పేలుడు తీవ్రతకు టైర్‌ ఉన్న చోట సీట్‌లో కూర్చున్న హోసూరు, పత్తికొండ, ఆదోనికి చెందిన వెంకటేష్‌, కార్తీక్‌, గిరి అనే ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఉన్నఫళంగా పెద్ద శబ్దంతో టైరు పేలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ వాహనం సిబ్బంది గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఘటన జరగడంతో ముప్పు తప్పిందని, రక్షణ గోడలు లేని వంతెన వద్ద టైరు పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

డిపో మేనేజర్‌పై మండిపాటు

ఆదోని, పత్తికొండ రెండు డిపోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రెహమాన్‌పై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పత్తికొండ డిపోలో కాలం చెల్లిన బస్సులలో ప్రతిరోజు ప్రయాణం నరకప్రాయంగా మారింది. బస్టాండ్‌ నుంచి బయలుదేరిన బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా అనునిత్యం మార్గం మధ్యలో నిలిచిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనికితోడు పత్తికొండ బస్టాండ్‌కు వచ్చే ఇతర డిపోల సిబ్బంది ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా నడపడం వల్ల అందుబాటులో ఉన్న బస్సులపై రద్దీ తీవ్రత పడుతుంది. దీంతో బస్సులో ప్రయాణం చేసేవారు అవస్థల నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. అదే విదంగా రద్దీ వల్ల సోమవారం సాయంత్రం పత్తికొండ బస్డాండ్‌లో గుంతకల్‌కు చెందిన హసీనా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వైద్య చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయింది. పత్తికొండ డిపో మేనేజర్‌గా ఉన్న రెహమాన్‌ సంక్రమంగా విధులకు రాకపోవడం పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది విధులపై కూడా సంక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో మేనేజర్‌ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే సమస్యలపై నేరుగా గతంలో చాలా మంది రీజనల్‌ మేనేజర్‌ శ్రీనువాసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తోపులాటలో అస్వస్థతకు గురైన మహిళ మృతి

కర్నూలు నుంచి గుంతకల్‌కు బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్‌కు చెందిన హసీనా (55) అనే మహిళ సోమవారం సాయంత్రం పత్తికొండ బస్టాండ్‌లో వాష్‌రూమ్‌కు దిగింది. తిరిగి బస్సు ఎక్కే క్రమంలో రద్దీ వల్ల జరిగిన తోపులాటలో ఊపిరి అందక స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి మణిదీప్‌ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. బస్సులో రద్దీ వల్లనే తన అమ్మ అకారణంగా చనిపోయిందని కుమారుడు దాదాపీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement