నందవరం: ‘చదువుకోవాలని ఉంది. కేజీబీవీలో సీటు ఇప్పించండి.. మేడం’ అంటూ పెద్దకడబూరు మండలం, కమ్మలదిన్నెకు చెందిన కురవ కావేరి జిల్లా కలెక్టర్ ఏ.సిరిని వేడుకుంది. మంగళవారం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌కు కేజీబీవీలో సీటు కేటాయించాలని కోరుతూ కావేరి వినతి పత్రం అందజేసింది. 7వ తరగతి వరకు చదివానని, తర్వాత తల్లిదండ్రులు చదివించలేకపోవడంతో మధ్యలోనే వదిలేశానని తెలిపింది. కేజీబీవీలో దరఖాస్తు చేసుకున్నా సీటు రాకపోవడంతో చదువుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నందవరం మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటున్నానని, తనకు కస్తూర్బాలో సీటు ఇప్పించి చదివించాలని జిల్లా కలెక్టర్‌ను ఆ బాలిక వేడుకుంది. కలెక్టర్ స్పందిస్తూ కేజీబీవీలో సీటు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో కావేరి సంతోషం వ్యక్తం చేసింది.


